మెగాస్టార్‌ చిరంజీవి కొత్త ప్రాజెక్టు.. ఆనందంలో అభిమానులు!

మెగాస్టార్‌ చిరంజీవి కొత్త ప్రాజెక్టు గురించి ఓ వార్త తెగ ప్రచారంలో ఉంది. చిరు కోసం ప్రముఖ దర్శకుడు శంకర్‌ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. అన్నీ కుదిరితే ఈ సినిమాను అల్లు అరవింద్‌ నిర్మించనున్నట్లు సమాచారం. ‘రోబో’, ‘2.ఓ’ వంటి భారీ బడ్జెట్‌ సినిమాల్ని తీసిన శంకర్‌.. చిరు కాంబినేషన్లో సినిమా అనడంతో అభిమానులు ఎగ్జైట్‌ అవుతున్నారు. దీనికి సంబంధించి చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. శంకర్‌ ప్రస్తుతం ‘భారతీయుడు 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన చిరు కోసం కథ సిద్ధం చేయబోతున్నారని తెలిసింది.

చిరు ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, తమన్నా, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్‌ చరణ్‌ నిర్మాత. చిరు ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని కూడా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై చెర్రీ నిర్మించనున్నారు.