పనిభారంతోనే కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించా: కేసీఆర్‌


టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీ ముగిసింది. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి కార్యవర్గ సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్‌ను రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రతిపాదించగా కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఇక నుంచి పార్టీ వ్యవహారాలు మొత్తం కేటీఆర్‌ చూసుకుంటారని సభ్యులకు ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలని, కార్యనిర్వాహక అధ్యక్షుడు రోజూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

ప్రతి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఉండాలని కేసీఆర్‌ అన్నారు. తనతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉంటామని చెప్పారు. పనిభారం ఎక్కువగా ఉన్నందునే కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించానని, పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకే ఆయన్ను నియమించామన్నారు. పార్టీ నిర్మాణ బాధ్యతలను కేటీఆర్‌ పర్యవేక్షిస్తారన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి అనుసంధానకర్తగా ఆయన ఉంటారని కేసీఆర్‌ చెప్పారు. రేపు మధ్యాహ్నం కేటీఆర్‌ నేతృత్వంలో మరోసారి సమావేశం కావాలని టీఆర్‌ఎస్‌ అధినేత‌ నిర్ణయించారు. జాతీయ స్థాయిలో ప్రజాపోరాటాలు, సైద్ధాంతిక పోరుకు కార్యకర్తలు, నేతలంతా సిద్ధంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇకనుంచి ప్రభుత్వం ఇచ్చిన అన్నిహామీలు నెరవేర్చాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు.