HomeTelugu Reviews'గాడ్‌ ఫాదర్' మూవీ రివ్యూ

‘గాడ్‌ ఫాదర్’ మూవీ రివ్యూ

god father

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళంలో మోహన్ లాల్ చేసిన ‘లూసిఫర్’కి ఇది రీమేక్. చిరంజీవి తన ఇమేజ్ కి భిన్నంగా చేసిన ‘గాడ్ ఫాదర్’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ: రాష్ట్ర ముఖ్యమంత్రి పీకేఆర్ (సర్వదమన్ బెనర్జీ) చనిపోతాడు. దాంతో ఆయన స్థానంలో ముఖ్యమంత్రి కావడానికి అప్పటివరకూ హోమ్ మినిష్టర్ గా ఉన్న నారాయణ వర్మ (మురళీ శర్మ) ప్రయత్నిస్తుంటాడు. పీకేఆర్ పెద్ద కూతురు సత్యప్రియ (నయనతార) భర్త జయదేవ్ (సత్యదేవ్) తన మామగారి కుర్చీని తాను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. భర్తను చాలా మంచివాడని నమ్ముతూ వచ్చిన సత్యప్రియ, అతని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని చూస్తుంటుంది. అయితే అందుకు బ్రహ్మ (చిరంజీవి) అడ్డుపడతాడేమోనని ఆమె కంగారు పడుతూ ఉంటుంది.

బ్రహ్మ .. సత్యప్రియకి సవతి తల్లి కొడుకు. అతని కారణంగానే తన తల్లి చనిపోయిందని భావించిన సత్యప్రియ ద్వేషం పెంచుకుంటుంది. చెల్లి ఆలనా పాలన తానే చూసుకుంటూ వస్తుంది. దుబాయ్ వెళ్లిన బ్రహ్మ అక్కడ మాఫియా సామ్రాజ్యంలో ‘గాడ్ ఫాదర్’ గా ఎదుగుతాడు. రాజకీయంగా తన చుట్టూ చేరుతున్న శత్రువుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, తనకి అండగా నిలబడతాడనే ఉద్దేశంతో పీకేఆర్ అతనిని పిలిపిస్తాడు పీకేఆర్ చనిపోవడంతో వారసుడినంటూ ఆయన ఎక్కడ పోటీకి వస్తాడోనని సత్యప్రియ – జయదేవ్ ఆయనను దూరంగా ఉంచుతారు.

తన తండ్రి పార్టీకి దూరంగా ఉంటూనే .. ఆయన ఆశయాలను బ్రహ్మ ఎలా నెరవేర్చాడు? తన పట్ల సత్యప్రియకి గల అపోహలను ఎలా తొలగించాడు? భర్త కారణంగా సమస్యల ఊబిలో చిక్కుకున్న ఆమెను ఆయన ఎలా రక్షించాడు? పదవి కోసం ప్రాణాలు తీయడానికి వెనుకాడని జయదేవ్ కి ఆయన ఎలా బుద్ధి చెప్పాడు? అనేదే కథ.

god father 1

నటీనటులు: ‘గాడ్ ఫాదర్’ గా చిరంజీవి పూర్తి న్యాయం చేశాడు. నయనతార సత్య ప్రియ పాత్రలో మెప్పించింది. ఇక పదవి కోసం ఎంతకైనా తెగించే జయదేవ్ పాత్రకి సత్యదేవ్ పూర్తి న్యాయం చేశాడు. సముద్రఖని .. మురళీశర్మలకి కూడా ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలే దక్కాయి. ఇక సునీల్ చేసింది చాలా చిన్న పాత్ర. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు చేయవలసిన పాత్ర ఇది. తెరపై కనిపించిన కాసేపు అయినా సల్మాన్ తన మార్క్ చూపించి వెళ్లాడు.

విశ్లేషణ: పొలిటికల్ డ్రామాగా .. ఎమోషన్ తో కూడిన యాక్షన్ జోనర్లో ఈ కథా నడుస్తుంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఈ కథను తీర్చిదిద్దడంలో సత్యానంద్ పాత్ర కూడా ఉంది. నేరుగా తెలుగు కథను చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. చిరంజీవి లుక్ మొదలు, ప్రతి విషయంలో మోహన్ రాజా తీసుకున్న శ్రద్ధ కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు గాడ్ ఫాదర్ స్థాయిని పెంచుతూ వెళ్లిన విధానం బాగుంది. ఇంటర్వెల్ .. క్లైమాక్స్ లోను సల్మాన్ ఉండేలా ప్లాన్ చేసుకున్న తీరు కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది.

సవతి కొడుకు .. తండ్రికి దూరంగా పెరగడం .. గాడ్ ఫాదర్ గా ఎదగడం అనే ట్రాక్ పాతదే. అలాగే మరదలిని డ్రగ్స్ కి బానిసను చేసి, ఆమెను లోబరుచుకోవాలనే బావగా సత్యదేవ్ ట్రాక్ కూడా పాతదే. సవతి తల్లి కూతురి కోసం అన్నగారు రంగంలోకి దిగడం కూడా కొన్ని పాత సినిమాలను గుర్తుకు చేస్తుంది. ఈ అంశాలు ‘లూసిఫర్’ కంటే ముందునుంచి ఉన్నవే. మరి ఈ సినిమాలో కొత్తగా కనిపించేదేమిటంటే, ఇలాంటి ఒక కథను తన ఇమేజ్ కి భిన్నంగా చిరూ చేయడమే. ఆయన చేసిన ఆ ప్రయోగమే కొత్తగా అనిపిస్తుంది. కథ కొత్తది కాకపోయినా .. కథనం అక్కడక్కడా మందగించినా మెగాస్టార్ మాయాజాలం ప్రేక్షకులను కూర్చోబెడుతుంది. కథను పూర్తిస్థాయి రాజకీయాల్లోనే తెరకెక్కించారు.

god father 2

టైటిల్‌ : ‘గాడ్ ఫాదర్’
నటీనటులు : చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ, సముద్రఖని, సర్వదామన్ బెనర్జీ తదితరులు
నిర్మాణం: మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
దర్శకత్వం: మోహన్ రాజా
సంగీతం : తమన్

హైలైట్స్‌‌: చిరంజీవి, సత్యదేవ్‌ నటన
డ్రాబ్యాక్స్‌: కొన్ని సన్నివేశాలు

చివరిగా: ‘గాడ్ ఫాదర్’ చిరంజీవి ఫ్యాన్స్‌కు పండగే..
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu