మీలానే.. నా హృదయంలోనూ అంతే ఆగ్రహం ఉంది: మోడీ

ప్రస్తుతం ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో… తన హృదయంలోనూ అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బిహార్‌లో పర్యటిస్తున్న ఆయన బరౌనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పట్నా మెట్రోరైల్‌ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… ‘పట్నాకు చెందిన వీర జవాను సంజయ్‌ కుమార్‌ సిన్హా, భాగల్‌పూర్‌కు చెందిన రతన్‌ కుమార్‌కు నివాళులర్పిస్తున్నాను. దేశం కోసం వారు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ప్రస్తుతం మీలో ఎంతటి ఆగ్రహం ఉందో… నా హృదయంలోనూ అంతే ఆగ్రహం ఉంది’ అని అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

కాగా, తమ ప్రభుత్వ పాలనలో ఎన్నో అభివృద్ధి పథకాలను కొనసాగించామని మోడీ తెలిపారు. ‘బిహార్‌తో పాటు తూర్పు భారత‌ రాష్ట్రాలకు ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ఉర్జా గంగా గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. ఈ పథకం ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలను గ్యాస్‌ పైప్‌లైన్‌లతో కలుపుతున్నాం. మైట్రోరైలు ప్రాజెక్టు పాటలీపుత్ర మీదుగా కూడా నిర్మిస్తున్నాం. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు చేపట్టాం. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. 70 ఏళ్లుగా ప్రాథమిక సౌకర్యాలు కూడా వారికి ఆ సదుపాయాలను అందిస్తున్నాం’ అని మోడీ వ్యాఖ్యానించారు.