HomeTelugu Newsన్యాయం జరిగే వరకు పోరాడాలి: పవన్‌ కళ్యాణ్‌

న్యాయం జరిగే వరకు పోరాడాలి: పవన్‌ కళ్యాణ్‌

6 28
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌.. ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతులకు స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడాలని ఆయన సూచించారు. మందడంలో మహాధర్నా చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించిన అనంతరం పవన్‌ మాట్లాడారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర నాయకులు కూడా రాజధాని రైతులకు అండగా నిలబడుతున్నారని చెప్పారు. మూడు రాజధానుల పేరుతో అన్ని ప్రాంతాల ప్రజల్లో గందరగోళం సృష్టించారని విమర్శించారు. రైతు కన్నీరు పెడితే ఏ ప్రాంతం కూడా బాగుపడదన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు తర్వాతి ప్రభుత్వాలు కొనసాగించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అమరావతి రైతుల పోరాటంలో తాను భాగస్వామ్యమవుతానన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితులు, మదనపల్లెలో టమాటా రైతుల తరఫున జనసేన పోరాడిందని పవన్‌ గుర్తు చేశారు.

ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉన్నా ఒక్కరోజైనా అక్కడికి వెళ్లారా అని పరోక్షంగా సీఎం జగన్‌ను పవన్‌ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను వచ్చిన సమయంలోనూ పాదయాత్రలో భాగంగా పక్క జిల్లాలోనే ఉండి అక్కడి వెళ్లి పరామర్శించలేదని విమర్శించారు. పశ్చిమబెంగాల్‌లోని సింగూరులో 100 ఎకరాలకే తీవ్రస్థాయిలో పోరాటం జరిగిందని.. అలాంటప్పుడు వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందన్నారు. హద్దులు చెరిపేసిన తర్వాత భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తామంటే ఎలా అని పవన్‌ ప్రశ్నించారు. రైతులకు ఎలా న్యాయం చేయబోతున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు న్యాయం చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేసేందుకు వీల్లేదన్నారు. అర్ధరాత్రి రైతుల ఇళ్లల్లోకి వెళ్లి అరెస్టులు చేయడం దారుణమన్నారు. పెయిడ్‌ ఆర్టిస్టులన్న ప్రతి ఒక్కరికీ చెంపమీద కొట్టేలా బలమైన సమాధానం ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంత పర్యటనకు తాను రాకుండా ముళ్ల కంచెలు వేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారని.. అయినా రైతుల కోసం వచ్చానన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu