చంద్రబాబు నాయకుడు కాదు.. మేనేజర్‌ మాత్రమే

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక సార్లు చెప్పాం.. లోక్‌సభలో చెప్పాం, రాజ్యసభలో చెప్పామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ‘ప్రత్యేక హోదా వద్దని కేసీఆర్‌ చెప్పారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నేనెందుకు వద్దంటాను. ఏపీకి హోదా ఇస్తూనే.. తెలంగాణకు కూడా న్యాయం చేయాలని కోరాను. అవసరమైతే ఈ అంశంపై ప్రధానికి లేఖ రాస్తా. ఏపీకి లోటు బడ్జెట్‌ పూడ్చేందుకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఏపీకి నిధులు వస్తున్నాయి, చంద్రబాబు తీసుకుంటూనే ఉన్నారు. హోదా వద్దనేది చంద్రబాబే.. ఇవ్వమనేది చంద్రబాబే. పరిపాలన సరిగ్గా చేయలేని అసమర్థతను ఇతరుల మీదకు నెడుతున్నారు. చంద్రబాబు నాయకుడు కాదు, మేనేజర్‌ మాత్రమే. ఇద్దరు ఎంపీలను పెట్టుకుని తెలంగాణ సాధించిన వ్యక్తిని నేను. కేంద్రంలో చక్రం తిప్పుతానని నేను ఎప్పుడూ చెప్పలేదు. చంద్రబాబు ఏనాడూ కేంద్రంలో చక్రం తిప్పలేదు. తెలంగాణ చేపట్టిన పథకాలను ఇవాళ ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నాయి. కొన్ని తెలంగాణ పథకాలనే చంద్రబాబు కాపీ కొట్టారు. హరికృష్ణ మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చంద్రబాబు చూశారు. హరికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలంటే మరో మార్గమే లేదా? నందమూరి సుహాసినిని ఎన్నికల్లో నిలిపి ఆమెను బలిపశువు చేశారు.

హైదరాబాద్‌కు ఉన్న భౌగోళిక అనుకూలత వల్లే ఐటీ అభివృద్ధి జరిగింది. రాజీవ్‌ గాంధీ హయాంలోనే హైదరాబాద్‌లో ఐటీ రంగానికి పునాదులు పడ్డాయి. సైబర్‌ టవర్స్‌కు రాజీవ్‌గాంధీ, ఎన్‌. జనార్దన్‌రెడ్డి పునాదిరాయి వేశారు. టీఆర్‌ఎస్‌ హయాంలో కూడా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయి. చంద్రబాబులా మేం నిరంతరం డబ్బా కొట్టుకోం. తెలంగాణలో టీడీపీ ఓడిపోయినందుకు ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ జై అని.. చంద్రబాబుతో అనింపించాం. చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ అందుతుంది. నేను ఈ మధ్యన విశాఖ వెళ్తే అక్కడి ప్రజలు చాలా బాగా స్వాగతించారు. నేను భగవంతుణ్ని నమ్మి పూజలు చేస్తే చంద్రబాబుకు అభ్యంతరం ఏమిటి?. నేను రాజశ్యామల యాగం చేశాను. స్వరూపనందస్వామి సూచనల మేరకు నేను విశాఖలోని రాజశ్యామల ఆలయాన్ని దర్శించుకున్నాను. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 3 రాష్ట్రాల్లో గెలిచింది. మూడు రాష్ట్రాల్లో జరగని ట్యాంపరింగ్‌ తెలంగాణలో మాత్రమే జరిగిందా? ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగితే మా స్పీకర్‌, మంత్రులు ఎలా ఓడిపోయారు?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.