రాజకీయంగా చంద్రబాబు అంతు చూస్తాం: కేటీఆర్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు చంద్రబాబుకు తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే తాము ఏపీలోనూ వేలుపెడతామని, రాజకీయంగా చంద్రబాబు అంతు చూసేందుకు కూడా వెనుకాడమన్నారు. శనివారం కేటీఆర్‌ మూసాపేటలో ఎన్నికల సభలో మాట్లాడారు. చంద్రబాబు తన శక్తిని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని, డబ్బులు, మీడియా రెండింటినీ అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

‘పొట్టోడి నెత్తి పొడుగోడు కొడితే.. పోడుగోడి నెత్తి పోచమ్మ కొట్టిందన్న’ సామెత చందంగా సమయం వచ్చినప్పుడు చంద్రబాబుకు ఎలా బుద్ధి చెప్పాలో కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చన్నారు. హైదరాబాద్‌లో నాటకాలాడితే ఆయనను అమరావతికి తరిమికొట్టామన్నారు. ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబును ఆయన పార్టీని తెలంగాణ సమాజం తరిమికొడుతుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని.. ఆ ఫ్రంట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తమ పట్టు చూపెడతామన్నారు కేటీఆర్‌.