మహేష్ నిర్మాత మారిపోయారా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దాదాపు వంద కోట్ల బడ్జెట్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత మహేష్ బాబు మరో రెండు ప్రాజెక్ట్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తనకు ‘శ్రీమంతుడు’ లాంటి హిట్ సినిమా దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యాడు.

అయితే ఇప్పటివరకు వంశీ పైడిపల్లి రూపొందించే చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించబోతున్నట్లు అందరూ అనుకున్నారు. సరికొత్త కథతో ఉండే ఈ చిత్రం మహేష్ ఇమేజ్ ను ఇంకాస్త పెంచుతుందని ప్రచారం జరిగింది.వచ్చే ఏడాది జూన్ లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. గతంలో మహేష్ బాబు భార్య నమ్రతకు పివిపి బ్యానర్ కు మధ్య కొన్ని విబేధాలు ఏర్పడ్డాయి. వంశీ పైడిపల్లితో పివిపి వారు సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా మహేష్ సరిగ్గా స్పందించలేదు. ఇప్పుడు కావాలనే నిర్మాతను మార్చేశారని చెప్పుకుంటున్నారు!