‘f2’ మహేష్ ప్రశంసలు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘f2’ మూవీని చాలా ఎంజాయ్‌ చేశానని అన్నారు. ఈ చిత్రాన్ని చూసిన ఆయన ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయం చెప్పారు. వెంకీ టైమింగ్ ఫన్నీగా ఉందని అన్నారు. ‘f2′ సినిమా చూశా. పూర్తి వినోదాత్మక చిత్రం. చాలా ఎంజాయ్‌ చేశా.. వెంకీ సర్‌ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు, అది చాలా ఫన్నీగా అనిపిస్తుంది.. బ్రిలియంట్‌. వరుణ్‌తేజ్‌ పాత్ర కూడా సరదాగా ఉంటుంది. వెంకీ సర్‌ టైమింగ్‌కు వరుణ్ సరిగ్గా‌ సరిపోయారు’ అని మహేశ్‌ పోస్ట్‌ చేశారు.

వెంకటేష్‌‌, వరుణ్‌తేజ్‌ కలిసి నటించిన మల్టీస్టారర్‌ ‘f2’. ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్ అనేది ఉపశీర్షిక. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్‌లు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. శనివారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది.

మహేష్‌ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. దిల్‌రాజు, అశ్వినిదత్‌, ప్రసాద్‌ వి. పొట్లూరి సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్‌, నవీన్ చంద్ర, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, సాయికుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.