HomeTelugu Trendingఏడేళ్ల నా శ్రమ, కల నిజం కాబోతోంది: మంచు విష్ణు

ఏడేళ్ల నా శ్రమ, కల నిజం కాబోతోంది: మంచు విష్ణు

Manchu Vishnu tweet on kann
విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ గురించి మంచు విష్ణు చెబుతూ వస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాను పట్టాలెక్కించారు. ఆ మధ్య శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పూజా కార్యాక్రమాలతో సినిమాను మొదలుపెట్టిన విష్ణు.. ఇప్పుడు చిత్రీకరణ కోసం న్యూజీలాండ్ వెళ్లారు. న్యూజీలాండ్‌లో అందమైన లొకేషన్లలో షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు విష్ణు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఒక పెద్ద మెసేజ్‌ను అభిమానులకు ఇచ్చారు.

‘ఈరోజు న్యూజీలాండ్‌లోని అందమైన లోకేషన్లలో కన్నప్ప షూటింగ్‌ను ప్రారంభిస్తున్నప్పుడు నా జీవితకాలంలో పొందని అనుభూతిని పొందాను. ఆ శివ పార్వతుల ఆశీస్సులతో ఏడేళ్ల నా శ్రమ, కల నిజం కాబోతోంది. కన్నప్ప సినిమా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ గత ఎనిమిది నెలలుగా ఎంతో కష్టాన్ని చూశారు. అందరూ నిద్రలేని రాత్రులు గడిపారు. పండగలు, పబ్బాలు మరిచిపోయి పని చేశారు. రోజుకు ఐదు గంటల నిద్రనే విలాసవంతమైన భోగంగా భావించారు. ఎంత కష్టంగా అనిపించినా ఏ ఒక్కరూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా శ్రమించారు.

ఏడేళ్ల క్రితం తనికెళ్ల భరణి నాతో ఈ కన్నప్ప కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడే దాని స్థాయి ఎలా ఉంటుందో ఊహించుకున్నాను. ఆ తరువాత ఈ కథలోకి ఎంతో మంది ప్రతిభావంతులైన నిపుణులు వచ్చి చేరారు. పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, తోటపల్లి సాయినాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి ఇలా అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచారు.

కన్నప్ప సినిమాకు ప్రాణం పోసేందుకు ఇప్పుడు దేశ విదేశాల నుంచి వచ్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులు మొత్తం 600 మంది మరికొద్ది రోజుల్లో రంగంలోకి దిగబోతున్నారు. ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేస్తే ఈ కన్నప్ప నేడు ఇక్కడి వరకు వచ్చింది. కన్నప్ప చేయగలనా? లేదా? అని నా మీద నాకే సందేహం కలిగినప్పుడు.. నన్ను నమ్మి ప్రోత్సహించిన, ముందుకు నడిపించిన మా నాన్నకి ధన్యవాదాలు. నా సోదరుడు వినయ్ ప్రోత్సాహం నేను ఎప్పటికీ మరిచిపోలేను.

కన్నప్ప సినిమాలో ఎంతో మంది సూపర్ స్టార్లు నటించబోతున్నారు. ఆ వివరాలన్నీ త్వరలోనే రివీల్ చేయబోతున్నాం. మేం ఎంత సీక్రెట్‌గా ఉంచుదామని అనుకుంటున్నా కొన్ని లీక్స్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో సినీ ప్రేక్షకులు కేవలం మా ప్రొడక్షన్ అధికారిక ఖాతాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. మా కన్నప్ప ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఈ తరుణంలో అందరి ఆశీస్సులు, ప్రేమ, ప్రోత్సాహాన్ని మేం కోరుకుంటున్నాం. కన్నప్ప అనేది కేవలం సినిమా కాదు.. అది మా ప్రాణం, నమ్మకం, ఎంతో మంది కష్టం. మా ప్రయాణం ప్రారంభం అయింది. మనమంతా కలిసి ఓ మ్యాజిక్‌ను క్రియేట్ చేద్దాం. హర హర మహదేవ్’ అని మంచు విష్ణు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈసినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్‌, పార్వతీ దేవిగా నయనతార నటించినున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu