రాజశేఖర్ రెడ్డి నేను ఆప్త మిత్రులం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తాను అత్యంత ఆప్త మిత్రులమని శాసనసభలో వ్యాఖ్యానించారు. తామిద్దరూ ఒకే గదిలో నిద్రించిన ఘటనలూ ఉన్నాయని, ఆయనతో రాజకీయ వైరుద్యం తప్ప వ్యక్తిగత విభేదాలేమీ లేవని ఆయన అన్నారు. అక్రమనిర్మాణాలపై శాసనసభలో వైఎస్‌ విగ్రహాల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైఎస్ విగ్రహాల పట్ల తనకేమీ అసూయలేదని .. వాటిని కూల్చి వేయాలని కూడా తాను డిమాండ్ చేయడం లేదని అన్నారు.

శాసనసభలో ప్రజా వేదిక కూల్చివేత అంశంపై చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలోని ఇతర అక్రమ కట్టడాలు, రహదారులపై అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాల కూల్చివేత పై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ అంశంపై సభలో దుమారం రేగింది. అంబేద్కర్ విగ్రహాల కూల్చి వేయాలని ప్రతిపక్షనేత వ్యాఖ్యానిస్తున్నారంటూ అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు శాసనసభలో ఆందోళన చేశారు. ఓ దశలో పోడియం వద్దకు వెళ్లేందుకూ ప్రయత్నించారు. ఈ అంశంపై కొద్దిసేపు శాసనసభలో గందర గోళం నెలకొంది. స్పీకర్‌ తమ్మినేని కల్పించుకొని పరిస్థితిని చక్కదిద్దారు.