
AP Elections 2024: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు మరో వారం రోజులు మాత్రమే ఉన్నాయి. దీంతో రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. తమ నేతను గెలిపించుకోవడం కోసం ఇంటింటికి వెళ్లి రకరకాల విన్యాసాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటిని వదిలి ప్రజల్లోనే తిరుగుతున్నారు. అధికారంలో ఉండగా ఈ నాయకులకు ప్రజలు కనిపించరని, ఓట్లు రాగానే మాత్రం ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తూ ఇంటింటికి వస్తారు అని పలువురు విమర్శలు చేస్తున్నారు.
మరికొందరైతే రాజకీయ నేతల విన్యాసాలు చూసి నవ్వుకుంటున్నారు. తమ నేతను గెలిపించుకోవడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దల మాట కానీ అధికార పార్టీలోని కొందరు వైసీపీ నేతలకు మాత్రం ఇంటిపోరు ఎక్కువైంది. స్వపక్షంలోనే ప్రతిపక్షం అన్నట్టు తయారైంది. తమ ఇంట్లోని సభ్యులే తనను వ్యతిరేకిస్తూ ప్రచారం చేస్తుండటంతో తలలు పట్టుకుంటున్నారు. ఇంట గెలవలేకపోయినా రచ్చ గెలుస్తామంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
వైసీపీ అధినేత సీఎం జగన్‌కు సొంత చెల్లి వైఎస్ షర్మిల ప్రతిపక్షమైన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉంది. షర్మిల కూడా సీఎం జగన్‌ను ఓడించాలనే లక్ష్యంగా విమర్శల బాణాలు కురిపిస్తోంది. వైసీపీకి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని, ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, మరోసారి అవకాశం ఇస్తే ప్రజల జీవితాలతో చెలగాటమాడతారని, యువత భవిష్యత్తు నాశనమవుతుందని ఇప్పటికే ప్రతి బహిరంగ సభల్లోనూ షర్మిల దుమ్మెత్తి పోస్తున్నారు. 2014 ఎన్నికల్లో జగన్‌కు అనుకూలంగా ప్రచారం నిర్వహించిన విజయమ్మ సైతం ప్రస్తుతం సైలెంట్‌గా ఉండిపోయారు.
ఇదే బాటలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు ఇంటి నుంచే నిరసన సెగలు తలుగుతున్నాయి. అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి ఓటు వేయొద్దంటూ మాజీ అల్లుడు వీడియో విడుదల చేశాడు. మంచితనం, మానవత్వం లేని వ్యక్తి అని, సిగ్గు లేని అంబటి రాంబాబు లాంటి వారికి ఓటేస్తే సమాజం నాశనం అవుతుందని తీవ్రంగా విమర్శలు చేశారు. దీంతో ఓటర్లు ఆలోచనలో పడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి ఖండించారు. కేవలం పవన్‌ను తిట్టించేందుకే సీఎం జగన్ తన తండ్రిని వాడుకుంటున్నారని విమర్శించారు. పిఠాపురంలో పవన్ విజయం కోసం కృషి చేస్తానని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ ఇటీవల ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె క్రాంతి స్పందించారు.













