HomeTelugu ReviewsOm Bheem Bush: దెయ్యంతో శ్రీవిష్ణు కామెడీ సినిమాకే హైలైట్‌

Om Bheem Bush: దెయ్యంతో శ్రీవిష్ణు కామెడీ సినిమాకే హైలైట్‌

Om Bheem Bush reviewOm Bheem Bush review: టాలీవుడ్‌ శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో చూద్దాం.

క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మ్యాడీ (రాహుల్ రామకృష్ణ) ఈ ముగ్గురూ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ గ్యాంగ్‌కి బ్యాంగ్ బ్రోస్ అనే పేరు. పీహెచ్‌డీ కోసం కాలేజీలో జాయిన్‌ అయిన వీళ్లు.. చదువు తప్ప.. అన్నీ వేషాల వేస్తారు. ఇక కాలేజీలో వీళ్లు వేషాలు చూడలేక ప్రిన్సిపాల్ రంజిత్ (శ్రీకాంత్ అయ్యంగార్)‌యే వీళ్ల పేరు మీద పీహెచ్‌డీ పరీక్షలు రాయించి సర్టిఫికెట్లు ఇప్పించి వీళ్లను బయటికి గెంటేస్తాడు.

ఇక ముగ్గురూ వినయ్ ఊరు వెళ్తూ మధ్యలో భైరవపురంలో బండి ఆపుతారు. అక్కడ తాంత్రిక విద్యల పేరుతో కొందరు లంకెబిందులు తీయడం, దెయ్యాలు వదిలించడం వంటి పనులు చేసి ఈజీగా డబ్బు సంపాదించడం చూస్తారు. వీళ్లే ఇంతలా డబ్బు సంపాదిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ టెక్నిక్స్ చూపించి జనాల దగ్గర మనం కూడా డబ్బులు లాగేద్దామని ముగ్గురూ డిసైడ్ అయిపోతారు. దీంతో బ్యాంగ్ బ్రోస్ (A to Z సొల్యూషన్స్) అంటూ ఊరిలో టెంట్ వేసి సెట్ అయిపోతారు.వీరి అతి తెలివితేటలతో ఊరిలో జనాలని బాగానే బుట్టలో పడేస్తారు.

వీళ్ల రాకతో అప్పటివరకూ ఫుల్ బిజీగా ఉన్న తాంత్రిక పూజలు చేసే అఘోరాకి పని లేకుండా పోతుంది. దీంతో వీళ్లంతా దొంగ సైంటిస్టులు వీళ్లకి ఆత్మలను బంధించడం, గుప్త నిధులు కనిపెట్టడం తెలీదంటూ ఊరి జనాల ముందు పంచాయతీ పెడతాడు. అయితే దీన్ని జనాలు ఎవరూ నమ్మరు. దీంతో ఊరి చివర ఉన్న మహల్‌లో సంపంగి దెయ్యాన్ని బ్యాంగ్ బ్రోస్ పట్టుకొని, అక్కడున్న నిధులు కనిపెట్టాలి సవాల్ చేస్తాడు అఘోరా. గుప్త నిధులు అనగానే టెంప్ట్ అయిన బ్యాంగ్ బ్రోస్.. సవాల్‌ని స్వీకరిస్తారు. కానీ దానికి ప్రతిగా మూడు కండీషన్స్ పెడతారు. మరి ఆ మూడు కండీషన్స్ ఏంటి? ఆ మహల్‌లోకి వెళ్లి సంపంగి దెయ్యాన్ని బ్యాంగ్ బ్రోస్ పట్టుకున్నారా? అసలు ఆ ఆత్మ కథేంటి? అనేదే కథ.

శ్రీవిష్ణు కామెడీ టైమింగ్‌, డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. పైకి ఎంత సింపుల్‌గా కనిపిస్తాడో అంతకుమించి నవ్విస్తాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తోడు కావడంతో.. శ్రీవిష్ణుకి మరింత ప్లస్‌ అయింది అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ఎప్పుడు స్క్రీన్ మీద బ్యాంగ్ బ్రోస్ కనిపించినా థియేటర్లో జనాలు పడిపడి నవ్వుతూనే ఉన్నారు. ఇక సినిమాలో ఓ మూడు-నాలుగు కామెడీ సీక్వెన్స్‌ల్లో అయితే అదిరిపోయాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో బాగా ట్రోల్, వైరల్ అయిన డైలాగులతో బ్యాంగ్ బ్రోస్ ఓ ఆట ఆడుకున్నారు.

ఫస్టాఫ్ అంతా అలా సరదాసరదాగా సాగిపోతే సెకండాఫ్‌లో మాత్రం కొన్ని చోట్ల హార్రర్‌తో భయపెట్టారు. అలానే ఊహించని విధంగా కాస్త సెంటిమెంటును కూడా యాడ్ చేశారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో దెయ్యంతో శ్రీవిష్ణు చేసే కామెడీ సినిమాకే హైలెట్‌గా ఉంది. ఇక దెయ్యం చేతిలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ దెబ్బలు తినే సీన్లు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాయి. అయితే సినిమా క్లైమాక్స్‌‌ను మాత్రం ఊహించని విధంగా ప్లాన్ చేశారు డైరెక్టర్. అప్పటివరకూ కామెడీగా సాగిపోతున్న చిత్రానికి కాస్త సెంటిమెంట్ జోడించి చిన్న సందేశంతో హ్యాపీగా ముగించారు.

ఈ సినిమా చూసిన తర్వాత బ్యాంగ్ బ్రోస్ పాత్రల్లో వీళ్లను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేం. ఆ రేంజ్‌లో కామెడీ చేశారు ఈ ముగ్గురు. ముఖ్యంగా శ్రీవిష్ణు అయితే తన కెరీర్‌లో బెస్ట్ కామెడీ ఇచ్చాడు. ఇక రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి మరోసారి స్క్రీన్ మీద జాతిరత్నాలకి మించి ఎంటర్‌టైన్ చేశారు. వీళ్ల ముగ్గురి మ్యాజిక్‌తో థియేటర్లో లాజిక్స్ మర్చిపోయి ఆడియన్స్‌ నవ్వుతూనే ఉన్నారు. ఇక ఈ ముగ్గురి తర్వాత సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లిన పాత్ర మాత్రం దెయ్యం సంపంగిదే. ముఖ్యంగా కొన్ని సీన్లలో సంపంగి మాములుగా సెంటిమెంటు పండించలేదు.

అప్పటివరకూ నవ్వుతున్న ఆడియన్స్ కళ్లల్లో కొన్ని సీన్లలో నీళ్లు తిరిగాయి. ఇక రచ్చరవి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక కామాక్షి భాస్కర్ల, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ కనిపించేది కాసేపే అయినా తమ అందాలతో హీటెక్కించేశారు. మరో హీరోయిన్ ప్రీతి ముకుందన్‌కి పెద్దగా టాలెంట్ చూపించే అవకాశం ఏం రాలేదు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సరిగ్గా సరిపోయింది.

ముఖ్యంగా దెయ్యం వచ్చేటప్పుడు ఇచ్చిన బీజీ అయితే సూపర్‌ అంతే. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలను నూటికి నూరు శాతం పూర్తిగా వాడేసుకున్నారు డైరెక్టర్ శ్రీ హర్ష. అందుకే థియేటర్లు నవ్వులతో దద్దరిల్లిపోయాయి. ఇక థియేటర్ నుంచి బయటికి వచ్చిన ఆడియన్స్‌కి మాత్రం బ్యాంగ్ బ్రోస్ తప్ప ఇంకెవరూ గుర్తుండరు. ఆ రేంజ్‌లో నవ్వులు పూయించారు ఈ ముగ్గురూ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu