పేపర్లు, ఛానళ్లు ఉన్నాయని వైసీపీ పిచ్చివేషాలు వేస్తే ఊరుకోను: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడబోయేది జనసేన ప్రభుత్వమేనని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అమరావతిలో తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని వ్యాఖ్యానించారు. కృష్ణాజిల్లా కైకలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాయలసీమను రక్తసీమగా మార్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని పవన్‌ హామీ ఇచ్చారు.

పులివెందుల వేషాలు తన వద్ద వేస్తే ఊరుకోనన్నారు. పాతకోటలు బద్దలుగొట్టి కొత్త రాజకీయాలు తీసుకొస్తానని చెప్పారు. చంద్రబాబు, జగన్‌ కుటుంబాలే రాజకీయాలు చేయాలా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తానని హెచ్చరించారు. పేపర్లు, ఛానళ్లు ఉన్నాయని వైసీపీ పిచ్చివేషాలు వేస్తే ఊరుకోనని చెప్పారు. హైదరాబాద్‌లో కూర్చుని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను అడిగిన తర్వాతే జగన్‌ బీఫారాలు ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని విమర్శించారు.