ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు

పోలవరం స్పిల్‌వేలో క్రస్ట్‌ గేట్లను అమర్చే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన రైతు సదస్సులో సీఎం మాట్లాడారు. ప్రధాని మోడీకి గుజరాత్‌ ప్రాజెక్టులపై ఉన్న మక్కువ.. పోలవరంపై లేదని చంద్రబాబు విమర్శించారు. ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.53 వేల కోట్లు అవసరమని, కేంద్రం మాత్రం దీనిపై ఎలాంటి ఆసక్తి చూపడం లేదని అన్నారు. ప్రాజెక్టును చూసేందుకు ప్రధాని మోడీ ఒక్కసారి కూడా రాలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు దేశంలోనే అద్భుతంగా తయారవుతుందని అన్నారు. కాంక్రీటు పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని, వచ్చే నెల 7న గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ రికార్డు సాధించేలా కాంక్రీట్‌ పనులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజు 28 వేలకు పైగా క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని సంకల్పించినట్లు వివరించారు.

దేశంలోనే వేగంగా పూర్తి చేసే ప్రాజెక్టుగా పోలవరం నిలుస్తుందని అన్నారు. పనులు వేగంగా పూర్తి చేసిన ఘనత అధికారులు, ఇంజినీర్లు, నవయుగ సంస్థకు దక్కుతుందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమెలాగో పట్టిసీమతో నిరూపించామన్నారు. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసి నీరందిస్తామని చెప్పారు. ప్రాజెక్టులో 63 శాతం నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు. నిర్మాణ దశలోనే పోలవరం పర్యాటక ప్రాంతంగా మారిందని, రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రాజెక్టును చూసేందుకు వస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని.. అడ్డుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చూస్తున్నారని, ఒడిశా సీఎంతో కలిసి పోలవరం నిర్మాణానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవద్దని.. నిర్మాణానికి సహకరించాలని ఇదే వేదిక నుంచి కోరుతున్నానని చెప్పారు. పోలవరాన్ని అడ్డుకోవద్దని ఇతర రాష్ట్రాలనూ కోరుతున్నట్లు తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ పోలవరంపై దుష్ప్రచారం చేసిందని, అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. భూసేకరణతోపాటు పునరావాసాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు.‌