సాహో..సెట్స్‌ నుంచి ఆ వస్తువులను తీసుకువెళ్లిన ప్రభాస్‌!

సెట్స్‌లో ఏదన్నా ఓ వస్తువు నచ్చితే దానిని జ్ఞాపకార్థంగా తమతోనే ఉంచేసుకోవాలనుకునే నటీనటులు ఉన్నారు. యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కూడా ఈ కోవకు చెందినవారే. ప్రస్తుతం ఆయన ‘సాహో’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌ నుంచి ప్రభాస్‌ సాధారణ వస్తువులను కాకుండా ఏకంగా ఓ బైక్‌, కారునే ఇంటికి తీసుకెళ్లారట. ‘సాహో’ సినిమా జ్ఞాపకంగా వాటిని తన వద్ద దాచుకోవాలనుకున్నారని చిత్రవర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో బైక్స్‌, కార్లతో చేసే స్టంట్లదే ప్రధాన పాత్ర. ఇందుకోసం భారీ వాహనాలను తెప్పించారు. వాటిలో తనకు నచ్చిన ఓ బైక్‌, కారును ప్రభాస్ ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రభాస్‌ భారీ ఫైటింగ్‌ సన్నివేశాలు చేయబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నారట. ‘సాహో’ చిత్రానికి సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. ఎవ్లిన్‌ శర్మ, మందిరా బేడి, అరుణ్‌ విజయ్‌, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.