భారత్-పాకిస్తాన్ యుద్ధంపై పాక్ హీరోయిన్స్ సంచలన ట్వీట్స్..


సర్జికల్‌ స్ట్రైక్స్‌-2తో పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. 12 మిరాజ్‌-2000 జెట్‌ ఫైటర్స్‌తో జైషే స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. మిరాజ్‌ బాంబు దాడుల్లో దాదాపు 300 మంది జైషే ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. తమ జోలికొస్తే ఊరుకునేది లేదని ప్రధాని మోడీ పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. కాగా, ‘రాయిస్‌’ హీరోయిన్‌, పాక్‌ జాతీయురాలు మహిరాఖాన్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌-2పై కామెంట్‌ చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌కు దిగి భారత్‌ తప్పుచేసిందని అన్నారు. పాక్‌ను రెచ్చగొట్టి యుద్ధానికి కాలు దువ్వొద్దని హెచ్చరించారు.

‘పాక్‌ను రెచ్చగొట్టి భారత్‌ తప్పు చేసింది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ వంటి చర్యలతో యుద్ధానికి స్వాగతం పలికినట్టే. భారత్‌-పాక్‌ల మధ్య సాధారణ పరిస్థితులు రావాలి’ అని ఆకాక్షించారు. పాక్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో మనుమరాలు ఫాతిమా భుట్టో పంపిన ట్వీట్‌కు మహిరా ఈ మేరకు రెస్పాండ్‌ అయ్యారు. షారుఖ్‌ ఖాన్‌ హీరోగా రాహుల్‌ డోలకియా దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రాయిస్‌’ సినిమాలో మహిరా హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా 2017లో విడుదలైంది.