బ్యాట్‌ పట్టిన రజనీ!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ‘దర్బార్‌’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో రజనీ.. సరదాగా మూవీయూనిట్‌తో కాసేపు క్రికెట్‌ ఆడారు. తలైవా బ్యాటింగ్‌ చేస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ నెటిజన్లు.. ‘ఇది తలైవా ఐపీఎల్‌ మ్యాచ్’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మైదానంలో నయనతార, కమెడియన్‌ యోగిబాబు కూడా ఉన్నారు. ఆట మధ్యలో నయన్‌.. రజనీతో ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఈ చిత్రంలో రజనీ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు.

చివరిసారిగా 25 ఏళ్ల క్రితం వచ్చిన ‘పాండియన్‌’ చిత్రంలో రజనీ పోలీసు గెటప్‌ వేశారు. చాలా కాలం తర్వాత మళ్లీ తలైవా వెండితెరపై ఖాకీ దుస్తుల్లో కనిపించబోతుండడంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఏ.ఆర్‌ మురుగదాస్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. 2020 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకల ముందుకు తీసుకురాబోతున్నారు.