‘మహర్షి’ సెట్‌లోని ఫొటోల‌ను షేర్‌ చేసిన మహేశ్‌

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమా సెట్‌లో తీసిన కొన్ని ఫొటోల‌ను షేర్‌ చేశారు. పచ్చని పల్లెటూరిలో సినిమాలోని సన్నివేశాల్ని షూట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్‌బాబు స్మార్ట్‌గా కనిపించారు. ‘వృత్తిపట్ల ఎంతో మక్కువ ఉన్న, శ్రమించే ‘మహర్షి’ చిత్ర బృందంతో షూటింగ్‌ విరామ సమయంలో దిగిన ఫొటోలు’ అంటూ ‘బెస్ట్‌ ఈజ్‌ ఎట్‌ టు కమ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను మహేశ్‌ పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా ఈ చిత్రం సెట్‌లో తన కుమారుడు గౌతమ్‌తో కలిసి దిగిన ఫొటోను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. సినిమాలోని సన్నివేశాలు తనకు నచ్చాయని అన్నారు. కేవలం కంప్యూటర్‌ స్క్రీన్‌పై చూస్తేనే ఇంత బాగుందని.. వెండితెరపై వీక్షిస్తే ఇంకెంత బాగుంటుందో అని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె చెప్పారు.

వంశీ పైడిపల్లి ‘మహర్షి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. కానీ చిత్రం వాయిదా పడినట్లు నిర్మాత దిల్‌రాజు వెల్లడించారు. సినిమాను మే 9న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా రెండు పాటల చిత్రీకరణ జరగాల్సి ఉంది.