విజయ్‌కాంత్‌ను పరామర్శించిన రజనీకాంత్!

సీనియర్‌ నటుడు, డీఎండీకే అధినేత‌ విజయ్‌కాంత్‌ను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కలిశారు. ఈ మేరకు తలైవా శుక్రవారం సాలిగ్రాంలోని ఆయన ఇంటికి వెళ్లారు. విజయ్‌ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా విజయ్‌ నివాసం ముందున్న విలేకరులతో రజనీ మాట్లాడారు. ‘నాకు ఆరోగ్యం బాగోలేక రామచంద్ర ఆసుపత్రిలో చేరినప్పుడు నన్ను కలిసిన మొదటి వ్యక్తి విజయ్‌కాంత్‌. ఆయన అమెరికాలో చికిత్స తీసుకుంటున్నప్పుడే కలవాలనుకున్నా.. కానీ కుదరలేదు. ఇప్పుడు కోలుకుని అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఆయన సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఈ మీటింగ్‌లో మేం రాజకీయాల గురించి మాట్లాడుకోలేదు’ అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రజనీతో కలిసి తన నివాసంలో దిగిన ఫొటోలను విజయ్‌కాంత్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

త్వరలో జరగనున్నలోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇటీవల రజనీ ప్రకటించారు. అంతేకాదు, ఏ పార్టీకి మద్దతు తెలపనని స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయనున్నట్లు తెలిపారు. అభిమాన సంఘాలు, ఇతర పార్టీ వర్గాలు ప్రచారం కోసం తన ఫొటోలు వాడొద్దని అన్నారు.