అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ సినిమాలో సుశాంత్‌

అక్కినేని మేనల్లుడు హీరో సుశాంత్ చిలసౌ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కెరీర్‌లో కాళిదాసు, కరెంట్‌ చిత్రాల తర్వాత సక్సెస్‌ చూడని సుశాంత్‌.. చాలా ఏళ్ల తరువాత చిలసౌ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. అయితే చిలసౌ వచ్చి ఏడాది అవుతున్నా.. తన కొత్త సినిమా అప్‌డేట్‌ రావడం లేదని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్‌ విషయాలను వెల్లడించారు.

తన తరువాతి సినిమా అప్‌డేట్స్‌ గురించి ఇంతకాలం ఎదురుచూసిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ ఈ వారంలో తాను కొన్ని అప్‌డేట్‌లు, అనౌన్స్‌మెంట్స్‌ చేస్తానని ప్రకటించాడు సుశాంత్‌. అందులో భాగంగానే.. తాను అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తున్నట్లు హీరో సుశాంత్‌ ప్రకటించారు. ఈరోజే షూటింగ్‌ సెట్‌లో అడుగుపెట్టానని.. తనకెంతో ఇష్టమైన త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని.. ప్రస్తుతానికి ఈ మూవీ గురించి ఇంతకంటే ఏం చెప్పలేనని అన్నారు. హారిక అండ్‌ హాసిని, గీతా ఆర్ట్స్‌ సంస్థలో నటించడం ఆనందంగా ఉందన్నారు.