ఫొటోగ్రాఫర్‌ను భయపెట్టిన తారక్‌: పూజా హెగ్డే

‘అరవింద సమేత’ సినిమా సెట్‌లో జరిగిన ఓ సరదా సంఘటనను హీరోయిన్‌ పూజా హెగ్డే గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలోని కొంత భాగం షూటింగ్‌ స్విట్జర్లాండ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. షూట్‌ విరామ సమయంలో తీసిన వీడియోను పూజా హెగ్డే శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘షూట్‌ విరామంలో నేను, తారక్‌ అలా.. అందమైన ఈ స్విట్జర్లాండ్‌ లేక్‌ పక్కన సైకిల్‌ తొక్కాం. తారక్‌ చివర్లో మా ఫొటోగ్రాఫర్‌ను భయపెట్టారు. ఊహించని రీతిలో ఒక్కసారిగా అతని దగ్గరికి సైకిల్ తీసుకెళ్లారు’ అని పోస్ట్‌ చేశారు. ‘అరవింద సమేత’ షూట్‌ సరదాగా గడిచిందంటూ హ్యాష్‌ట్యాగ్‌లు జత చేశారు. ఈ వీడియో తారక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ‘అరవింద సమేత’ కు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ.158.6 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. ఇందులో ఎన్టీఆర్‌ రాయలసీమ కుర్రాడిగా కనిపించారు.

పూజా హెగ్డే ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు. మహేశ్‌బాబు హీరో పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క పూజా హెగ్డే బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్‌ 4’లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరులో విడుదల కాబోతోంది.