చంద్రబాబు కు ఇదే సరైన సమయం.. మేల్కొండి !

కీల‌క స‌మ‌యంలో చంద్ర‌బాబునాయుడు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌డం లేదు అంటూ వైసీపీ మీడియానే చంద్రబాబును ట్రోల్ చేస్తోంది. ట్రోలింగ్ సంగతి ఎలా ఉన్నా.. ఈ అంశంలో బాబు ఆలోచించుకోవాలి. ప్రజల్లో, కొందరి ప్రత్యర్ధి నాయకుల్లో జగన్ రెడ్డి పట్ల ఉన్న వ్యతిరేకత బయటకు సునామీలా కొట్టుకొచ్చే సమయంలో బాబు సైలెంట్‌ అయ్యిపోయారు. కేవలం ఆన్‌లైన్‌లో నాయ‌కుల‌తో స‌మీక్ష‌ల‌కే చంద్రబాబు ప‌రిమితం అయ్యారు. కారణాలు తెలియదు గానీ, ఇలా చేయడం టీడీపీ నష్టమే. పైగా ఇది బాబుకు సరైన సమయం. ప్రజలను తన వైపుకు మలచుకోవడానికి ఈ సమయాన్ని వాడుకోవాలి. ఓ వైపు టీడీపీ యువ కిశోరం నారా లోకేశ్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర జోరుగా సాగుతుంది. ఇప్పుడు తాను యాక్టివ్ గా ఉంటే.. లోకేశ్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర పై ప్రభావం పడే అవకాశం ఉందని బాబు ఫీల్ అవుతూ ఉండొచ్చు. తాను జ‌నం వ‌ద్ద‌కు వెళితే, లోకేశ్‌కు ప్రాధాన్యం ద‌క్క‌ద‌నే ఉద్దేశంతో బాబుకు ఇంటికి మాత్రమే ప‌రిమితం అయ్యి ఉండొచ్చు.

కానీ, జగన్ రెడ్డి లాంటి విధ్వంసకరమైన బలమైన రాజకీయ నాయకుడ్ని ఎదుర్కోవాలి అంటే.. లోకేశ్ పాద‌యాత్ర‌ ఒక్కటే సరిపోదు. టీడీపీకి ఊహించిన స్థాయిలో ఇంకా ప్ర‌జాద‌ర‌ణ ల‌భించాలి. ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అవ్వాలి. ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై సీరియ‌స్‌గా ఆలోచించాలి. ముఖ్యంగా చంద్రబాబు ఇప్పుడు ఆ దిశగా ముందుకు అడుగు వేయాలి. కేవలం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌తో చంద్రబాబు ఆన్‌లైన్‌లో స‌మావేశం పెడితే సరిపోదు, ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి లాంటి మరో సరికొత్త రాజకీయ ఎత్తుడగతో బాబు సాధ్యమైనంత త్వరగా ప్రజల్లోకి రావాలి.

నిజానికి బాబు ప్రస్తుతం టీడీపీ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు త‌దిత‌ర అంశాల‌పై దృష్టి పెట్టారు. అసలు పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు అనేది ఒట్టి పబ్లిసిటీ స్టంట్ లాంటిదే కదా. అది ఏ పార్టీ అయినా కావొచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు పనిలో ఉన్నాడు. అసలు ఈ డిజిటల్ జనరేషన్ లో పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు అనేది ఎవరికీ కావాలి ?, అదే, ప్రభుత్వ వ్యతిరేక కార్య‌క్ర‌మాన్ని అట్ట‌హాసంగా ప్రారంభించి.. దాన్ని బ‌లంగా నిర్వ‌హించి.. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడాలి. అప్పుడే కదా.. తటస్థ ప్రజలకు ప్రత్యర్థి పార్టీల పై, నాయకుల పై నమ్మకం కలిగేది ?, మరెందుకు ఈ నాన్చుడు వ్యవహార ధోరణి ?.

నేడు వైసీపీ మీడియా ‘టీడీపీ – జనసేన’ పోరాటం వ్యగ్యంగా విమర్శలు చేస్తుంది అంటే.. దానికి బాధ్యులు ఎవరు ?, అక్క‌డ‌క్క‌డ ఇదేం ఖ‌ర్మ అంటూ టీడీపీ నేత‌లు మొక్కుబ‌డి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం త‌ప్పితే, నిర్మాణాత్మ‌కంగా, నిబ‌ద్ధ‌త‌తో ఎవ‌రూ చేయ‌డం లేదు అంటూ వైసీపీ మీడియా డైరెక్ట్ గానే అనేక కథనాలను రాయిస్తోంది. ఈ కథనాల్లో నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు.. కానీ, పోరాటమే సరిగ్గా లేదని ప్రత్యర్ధులు ఎగతాళి చేస్తున్నారు అంటే.. దాని అర్ధం ఏమిటి ?, శత్రువులకు ఓడిపోతాం అనే భయాన్ని పుట్టించాలి. అసలు వీళ్లు సరిగ్గా యుద్ధమే చేయడం లేదనే అభిప్రాయాన్ని కాదు.
అయినా, ఈ విషయంలో చంద్ర‌బాబే ప‌ట్టించుకోన‌ప్పుడు, ఇక కిందిస్థాయిలో నాయ‌కులు ఎందుకు రిస్క్ చేస్తారు ?, ఈ ప్ర‌శ్న వైసీపీ మీడియా చేత అడిగించుకోకుండా టీడీపీ – జనసేన అదినాయకత్వం త్వరగా మేల్కోవాలి. ప్రధాన నాయకులు జ‌నంలోకి వెళ్తేనే, జ‌నంలోని భయాలు, అనుమానాలు పోతాయి. కాబట్టి బాబు గారు ప్రజల్లోకి రండి.

CLICK HERE!! For the aha Latest Updates