త్రివిక్రమ్ అంటే కష్టమేమో వెంకీ!

బాలీవుడ్ లో విజయం సాధించిన ‘జాలీ ఎల్ ఎల్ బి2’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి వెంకటేష్ ఆసక్తి చూపిస్తున్నాడనేది ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా రీమేక్ హక్కులను నిర్మాత రాధాకృష్ణ సొంతం చేసుకున్నారు. ఈ రీమేక్ ను వెంకీతోనే చేయాలని రాధాకృష్ణ కూడా భావిస్తున్నారు. దానికోసం దర్శకుడిని వెతికే పనిలో పడ్డారు. అయితే వెంకీ మాత్రం ఈ సినిమా ఎవరితో పడితే వారితో చేయనని అంటున్నాడట. తనకు దర్శకుడిగా త్రివిక్రమ్ కావాలని వెంకీ పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది.
రాధాకృష్ణ, త్రివిక్రమ్ స్నేహితులు కావడంతో వీరి కాంబినేషన్ లో సినిమా పక్కా అనుకున్నారంతా. కానీ దాంకి త్రివిక్రమ్ సిద్ధంగా లేడని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తోన్న త్రివిక్రమ్ దాని తరువాత ఎన్టీఆర్ తో ఓ సినిమా అలానే మహేష్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇవన్నీ పూర్తయ్యే సరికి కనీసం రెండు, మూడేళ్ళ సమయం పడుతుంది. మరి అప్పటివరకూ వెంకీ ఎదురుచూస్తాడా..? అంటే సందేహమే. దర్శకుడు ఎవరైనా.. పర్వాలేదని అనుకుంటే వెంకీ హీరోగా ఈ సినిమా పట్టాలెక్కుతుంది. లేదు నాకు త్రివిక్రమే కావాలని పట్టుబడితే మాత్రం నిర్మాత మరో హీరోను వెతుక్కోవాల్సిందే!