విజయ్‌ దేవరకొండ మా పనిచేసుకోనివ్వలేదు: దర్శకుడు

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ తమని పనిచేసుకోనివ్వలేదని దర్శకుడు భరత్‌ కమ్మా సరదాగా అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. జులై 26న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి పాట విడుదలైంది. ఈ సినిమాలోని రెండో పాటను ఆదివారం విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే పాటను విడుదల చేయలేకపోతున్నామని భరత్‌ కమ్మా ట్వీట్‌ చేశారు. దీనికి విజయ్‌ కారణమని తెలిపారు. ‘మీరు ఈ పాట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ప్రతి తరగతిలో ఇతరుల దృష్టి మళ్లించే ఓ చెడ్డ విద్యార్థి ఉన్నట్లే.. విజయ్‌ మమ్మల్ని పని చేసుకోనివ్వలేదు. దీనికి క్షమాపణ కోరుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ఆయనకు విజయ్‌ రిప్లై ఇచ్చారు. ‘నా పుట్టినరోజు.. బాగా క్రికెట్‌ ఆడాం. ఒళ్లు నొప్పులొచ్చేశాయ్‌. కూర్చుని పాట విన్నాం.. కానీ వీడియో కటింగ్‌ పూర్తి చేయలేదు. టీచర్‌ (దర్శకుడు) దృష్టి మారింది (నవ్వుతున్న ఎమోజీ). పాటను పక్కాగా మే 15న ఉదయం 11.11 గంటలకు విడుదల చేస్తాం… అమ్మతోడు..’ అని ట్వీట్‌ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates