పెథాయ్‌ తుఫాను బీభత్సం.. తూర్పు గోదావరిపైనే అధికం

పెథాయ్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. పంట నష్టాలను మిగుల్చుతోంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో పెథాయ్‌ తుపాను తీవ్రతపై హోంమంత్రి చిన రాజప్ప అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. దీని తీవ్రత తూర్పు గోదావరి జిల్లాపైనే అధికంగా ఉంటుందని తెలిపారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, ఈ సమయంలో 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ‘ఇప్పటివరకూ 107 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పునరావాస కేంద్రాల్లో మంచి నీరు, ఆహార పదార్ధాల కొరత లేకుండా చూస్తున్నాం. తుఫాను తీరం దాటిన తరువాత, ఆ ప్రాంతంలో సాయంత్రంలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుంది.’ అని మంత్రి చిన రాజప్ప తెలిపారు.