పులి పిల్లలను దత్తత తీసుకున్న విజయ్‌

తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి రెండు తెల్ల పులి పిల్లలను దత్తత తీసుకున్నారు. చెన్నైలోని వాండళూరు ప్రాంతంలో ఉన్న అరిగ్నర్‌ అన్నా జంతుప్రదర్శన శాలను విజయ్‌ సందర్శించారు. జూ అధికారులు పెంచుతున్న రెండు తెల్ల పులులను దత్తత తీసుకోవడంతో పాటు వాటి సంరక్షణకు రూ.5 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా విజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు ఈ జంతుప్రదర్శనల శాలను సందర్శించగానే ఓ అడివికి వెళ్లినట్లే అనిపించింది. ఇక్కడున్న జంతువుల్లో చాలా మటుకు మనకు అడవుల్లో కనిపించవు. అంతరించిపోతున్నాయి. ఇక్కడ సఫారీ కూడా ఉంది. మీరు కూడా(అభిమానులను ఉద్దేశిస్తూ) కుటుంబంతో కలిసి అప్పుడప్పుడూ విచ్చేయండి. మీ పిల్లలు కూడా ఎంజాయ్‌ చేస్తారు. అందరూ రూ.5 లక్షలు విరాళంగా ఇవ్వాలన్న నియమమేమీ లేదు. మీకు ఎంతో తోస్తే అంత ఇవ్వండి. అంతరించిపోతున్న మన దేశ జంతువులను కాపాడుకుందాం’ అని తెలిపారు. అయితే జాతీయ జంతువులను, పక్షులను ఇంటికి తీసుకెళ్లి పెంచడానికి ప్రభుత్వ నియమాలు ఒప్పుకోవు. ఈ నేపథ్యంలో 2009లో ప్రారంభమైన యానిమల్‌ ఎడాప్షన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా జంతువులను దత్తత తీసుకోవాలనుకునేవారు జూ అధికారులకే నగదు చెల్లించి వాటి ఆలనా పాలనా చూసుకోవచ్చు. గత పదేళ్లలో దాదాపు 150 మంది ఇక్కడి జంతువులను దత్తత తీసుకుని వాటి యోగక్షేమాలను చూసుకుంటున్నారని జూ యజమాని యోగేశ్‌ సింగ్ తెలిపారు. గతంలో తమిళ నటుడు శివకార్తికేయన్‌ కూడా ఓ పులిని దత్తత తీసుకున్నారు.