‘‘పోయి.. మీ పని చూసుకోండి’’.. ట్రోలింగ్స్‌పై విజయ్‌ సేతుపతి కౌంటర్‌


కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ ఇంట్లో ఆదాయ పన్ను అధికారుల సోదాలు తమిళనాట తీవ్ర ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల ఐటీ అధికారులు సుమారు 30 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో తొలుత భారీ మొత్తంలో నగదు, ఖరీదైన వజ్రాలు, బంగారం దొరికిందంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత విజయ్‌.. ఆదాయానికి సంబంధించిన లెక్కలన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయని, అదనంగా ఏమీ లభించలేదనే వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజగా ఐటీ అధికారులు కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆయనకు సమన్లు జారీ చేయడంతో మరోసారి చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో విజయ్‌ ఇంట్లో ఐటీ సోదాలకు ఇదే కారణం అంటూ సోషల్‌ మీడియాలో ఓ లేఖ చక్కర్లు కొడుతోంది. తమిళనాడులో మతపరమైన ప్రచారానికి మద్దతుగా నిలుస్తున్నందుకే విజయ్‌ని అధికారులు ప్రశ్నిస్తున్నారంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా విజయ్‌తో పాటు తమిళ హీరోలు ఆర్య, విజయ్‌ సేతుపతి, నటుడు రమేశ్‌ కన్నా తదితరులు కలిసి మత ప్రచారం కోసం వడపళనిలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ లేఖపై ట్విటర్‌లో స్పందించిన విజయ్‌ సేతుపతి ట్రోల్స్‌కు గట్టి ​కౌంటర్‌ ఇచ్చారు. ‘‘పోయి.. మీ పని చూసుకోండి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా తనకు మతపరమైన పట్టింపులు ఉండవని.. అందరితో కలిసి మెలసి ఉండటమే తనకు ఇష్టమంటూ విజయ్‌ సేతుపతి గతంలో అనేకమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే… విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న మాస్టర్‌ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates