ఊర్మిళ రాజకీయాల్లోకి రావడంపై.. వర్మ రియాక్షన్‌!

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు నటి ఊర్మిళ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. ఆమె గురించి అప్పుడప్పుడూ ఆయన సోషల్‌మీడియాలో మాట్లాడుతుంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళ స్టిల్‌ను షేర్‌ చేసి.. అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అయితే బుధవారం ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఊర్మిళ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాసానికి వెళ్లి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ముంబయి ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

కాగా ఈ వార్త తనను ఎంతో థ్రిల్‌ చేసిందని వర్మ అన్నారు. ఈ మేరకు ఊర్మిళ, రాహుల్‌ కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘హే ఊర్మిళ.. నీ కొత్త ప్రయాణం గురించి తెలుసుకుని ఎంతో థ్రిల్‌ అయ్యా. ఎంతో అందమైన మహిళవైన నువ్వు అందమైన రాజకీయ నాయకురాలివి కాబోతున్నావు’ అంటూ ‘రంగీలా’లోని ‘యాయిరే యాయిరే…’ పాట లిరిక్స్‌ను జత చేశారు. వర్మ తెరకెక్కించిన ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళ, ఆమిర్‌ ఖాన్‌ నటించారు. 1995లో ఈ సినిమా విడుదలై, హిట్‌ అందుకుంది.