Homeపొలిటికల్ఆంధ్రాకి ఐటీ ఏది ?, ఇక కంపెనీలు రావ్, కారణం జగనేనా ?

ఆంధ్రాకి ఐటీ ఏది ?, ఇక కంపెనీలు రావ్, కారణం జగనేనా ?

What is IT for Andhra

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఐటీ కంపెనీలు ఎందుకు రావడం లేదు ?, జవాబు.. కేవలం జగన్ ప్రభుత్వం అసమర్థతే. ఇది మార్కెటింగ్ యుగం. అసలు ఆంధ్ర రాష్ట్రం గురించి, ఆంధ్ర నాయకులు మార్కెట్ చేస్తేనే కదా పెట్టుబడులు వచ్చేది. మన ఐటీ శాఖామాత్యులు వారు ఎక్కువగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేది ఏ విషయాలు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే కాసేపు రాజకీయాలు సంగతి ప్రక్కన పెడితే, ఐటీ కంపెనీలు మాత్రమే కాదు, ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీలు ఏమి ఆశిస్తాయి ? అనే విషయాలు కూడా జగన్ కి, జగన్ మంత్రులకు తెలియకపోవచ్చు. వివిధ రకాల పన్ను రాయితీలు, తక్కువ ధరకు భూమి, మంచి రవాణా సౌకర్యాలు, ముఖ్యంగా ఎయిర్ కనేటివిటీ ఇవి కాకుండా వీకెండ్ సోషల్ లైఫ్, ప్రశాంతత.. ఇలాంటివి ఎన్నో కంపెనీలు ఆశిస్తాయి కదా!

సరే ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 2021-24 ఐటీ పాలసీ ని గమనించండి..

భూమి కేటాయింపు: ఒక ఐటీ కంపెనీకి భూమి కేటాయించాలి అంటే.. ఆ సంస్థ టర్నోవర్ 3 సంవత్సరాలకి రూ. 15 కోట్లు ఉండాలి, ఇంకా 250 మంది పైగా ఉద్యోగులు కలిగి ఉండాలి. మూడేళ్ళలో 500 మంది ఫ్రెషర్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. 5000 ఉద్యోగాలు ఫ్రెషర్స్ కి కల్పించగలిగితే భూమి ధర లో 60% రీయింబర్స్ చేస్తారు. ఇవి షరతులు. అసలు ఇవి కంపెనీలను ఆకర్షించే షరతులేనా ?. వీటికి తోడు లంచాలు. జగన్ రెడ్డి గురించి తెలిసిన ఎవరు అయినా ఈ విషయం చెబుతారు. విద్యుత్ సబ్సిడీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

కంపెనీలకు అనేక సౌకర్యాలు కల్పిస్తాం అన్నారు. ప్రస్తావనలు కూడా చాలా ఉన్నాయి, అయితే, గత మూడేళ్ళలో ఆచరణ దాదాపుగా శూన్యం. తాజాగా మళ్ళీ ఐటీ శాఖామాత్యులు వారు క్రొత్త పాలసీ తెస్తాము అని ప్రకటించారు, మరి ఆ పాలసీలో ఏముంటుందో చూడాలి. 2014 – 20 ఐటీ పాలసీ కూడా ఒకసారి చూడండి. చంద్రబాబు పాలసీ – జగన్ పాలసీ కంటే వెయ్యి రేట్లు బెటర్. కేవలం పాలసీల వల్ల కంపెనీలు పెట్టుబడులతో వచ్చేస్తాయా అంటే.. ? కాదు. కానీ కంపెనీలకు భరోసా కావాలి. ఒక లులు కంపెనీ వారి మాల్ సంగతి చూడండి, గత ప్రభుత్వం పారదర్శకత పాటించలేదు అని రద్దు చేశారు. ఇక HSBC సంగతి అందరికీ తెలిసిందే. ఇలా పెట్టుబడులు వచ్చే చోట జగన్ తన రాజకీయాలను చొప్పించడంతో ఏ కంపెనీకి భరోసా ఉంటుంది ?.

ఇంకా అదానీ డేటా సెంటర్ అన్నారు, దీని సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. గత మూడేళ్ళుగా అదిగో, ఇదిగో, రేపు, మాపు అని దోబూచులాట జరుగుతూనే ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం కియా మోటార్స్ లాంటి కంపెనీలను తీసుకొచ్చింది, అలాగే ఒక అమర్ రాజా బ్యాటరీస్, ఇలా పెట్టుబడిదారులను అభద్రతాభావానికి గురిచేసి, వారిని ప్రక్క రాష్ట్రాల వైపు చూసేలా చేయలేదు. ఇక్కడ పెట్టుబడి పెట్టడం రిస్క్ కదా, అనిపించే పరిస్థితులు ఉన్నంత కాలం , ఆంధ్రాలో ఒక సంస్థ కూడా పెట్టుబడి పెట్టదు. ఈ చిన్న విషయం జగన్ రెడ్డి అర్ధం చేసుకోలేకపోవడం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టకరం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu