‘చంద్రబాబు ఇవాళ హీరో అయ్యారు’: సిన్హా

విభజన హామీలు అమలు చేయాలంటూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చేస్తోన్న ధర్మపోరాట దీక్షకు పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌, బీజేపీ అసమ్మతి నేత శతృఘ్నసిన్హా దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శతృఘ్న సిన్హా మాట్లాడుతూ ఇవాళ దేశంలో చంద్రబాబు హీరో అయ్యారని కితాబిచ్చారు. కొన్ని నియమాలకు కట్టుబడే మనిషి ఆయన అని కొనియాడారు. ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు గళమెత్తారన్నారు. వ్యక్తి కంటే పార్టీ.. పార్టీ కంటే దేశం గొప్పవని.. ఈ విషయం ప్రధాని మోడీ తెలుసుకోవాలన్నారు. మోడీ మాటలకు చంద్రబాబు దీటుగా సమాధానమిచ్చారని ఆయన చెప్పారు. చౌకీదార్‌ ఏం చేస్తున్నారో దేశ ప్రజలు తెలుసుకున్నారని ఈ సందర్భంగా శతృఘ్నసిన్హా వ్యాఖ్యానించారు.

మరోవైపు రాత్రి 8 గంటలకు చంద్రబాబు దీక్ష విరమించనున్నారు. జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా చంద్రబాబుతో దీక్షను విరమింపజేయనున్నారు.