శృతి నన్ను పెళ్లి చేసుకుంటానంది, తన ప్రియుడు షాకయ్యాడు.. తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ నటి శృతి హాసన్‌ గురించి మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఆసక్తికరమై విషయాన్ని బయటపెట్టారు. శృతి.. లండన్‌కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తమన్నా కారణంగా ఓసారి శృతి ఇరుక్కున్నారట. ఈ విషయాన్ని తమన్నా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమన్నా, శృతి ఎప్పటినుంచో మంచి స్నేహితులు. ఓసారి శృతి ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేనే గనక అబ్బాయిగా పుట్టి ఉంటే తప్పకుండా తమన్నానే పెళ్లి చేసుకునేదాన్ని. ఎందుకంటే ఆమె మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయిని ఎవరు వదలుకుంటారు చెప్పండి’ అన్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ.. ‘శృతి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాట నిజమే. తనేదో సరదాగా అంది. శృతి అన్న మాట గురించి ఆమె ప్రియుడు మైఖెల్‌కు తెలిసింది. దాంతో అతను షాకై వెంటనే శ్రుతికి ఫోన్‌ చేసి ‘నువ్వు తమన్నాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా?’ అని అడిగాడు. అయితే ఈ విషయం గురించి మైఖెల్‌ అంతగా పట్టించుకోలేదు’ అని వెల్లడించారు.

మైఖెల్‌తో ప్రేమలో ఉన్నట్లు శృతి నేరుగా ఎప్పుడూ వెల్లడించలేదు. కానీ.. అతనితో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో తరచూ పోస్ట్‌ చేస్తుంటారు. ఇంట్లో జరిగే కార్యక్రమాలకు శృతి, మైఖెల్‌ కలిసే వెళుతుంటారు. అయితే పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడే తాను చేసుకుంటానని శ్రుతి ఒకానొక సందర్భంలో వెల్లడించారు.