బట్టతల నేపథ్యంపై ఈ మధ్య వచ్చిన బాలీవుడ్ సినిమా ‘బాలా’. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా బట్టతల కష్టాలను, దాన్ని కప్పిపుచ్చుకోడానికి పడే బాధలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇందులో అతనికి భార్యగా యామీ గౌతమ్ నటించింది. ఓ ఇంటర్వ్యూలో యామినీ గౌతమ్‌ను అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది. వెండితెరపైనే కాకుండా నిజజీవితంలోనూ బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు బదులుగా ‘ఎందుకు చేసుకోకూడదు అంటూ ఎదురు
ప్రశ్నించింది. బట్టతల పెళ్లికి అడ్డేమీ కాదని జవాబిచ్చింది. నిజానికి బట్టతల ఉన్నావారు చాలా శాంతస్వరూపులని అభివర్ణించింది. అయితే, అసలు బట్టతల వ్యక్తులు ముందుగా వాళ్లని వాళ్లు ప్రేమించుకోవాలి.. ఆ తర్వాతే మిగతావాళ్ల నుంచి ప్రేమని కోరాలని.. ఇదే సినిమా ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొంది. బాలా సినిమా విజయం పట్ల యామినీ సంతోషం వ్యక్తం చేసింది. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే సినిమాతో ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారని, ఇందులో టిక్‌టాక్ స్టార్‌గా వైవిధ్యభరితమైన పాత్ర చేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నానని తెలిపింది. నవంబర్ 7న విడుదలైన బాలా 5 రోజుల్లోనే రూ.61 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విజయ ఢంకా మోగిస్తోంది.