సమతుల్యం ఉండేలా తుది జాబితా: వై ఎస్‌ జగన్‌

ఈనెల 7న ఉదయం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. శాసనసభాపక్ష భేటీకి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మంత్రుల ఎంపికపై వారితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రాంతాలు, సామాజిక వర్గాలు, నేతల ప్రాముఖ్యత, తొలినుంచి పార్టీకి అందించిన సేవలను కొలమానంగా తీసుకుని మంత్రివర్గ జాబితా రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలువురిని ఎంపిక చేసిన జగన్.. మరి కొంతమంది మంత్రుల ఎంపికపై దృష్టి పెట్టారు. పలు జిల్లాల్లో మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయమై పార్టీ ముఖ్యనేతల అభిప్రాయం తీసుకుంటున్నారు. అన్ని అంశాల్లోనూ సమతుల్యం ఉండేలా తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు. మంత్రివర్గంపై తాను తీసుకున్న నిర్ణయాలను ముందుగానే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించాలని జగన్ నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఈనెల 7న వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో వారికి వివరించనున్నారు. సమావేశం అనంతరం మంత్రివర్గ సభ్యుల జాబితాను వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.