అశోక్ నుంచి లోకేష్ కు అన్ని కాల్స్ వెళ్లాయా?!

డేటా చోరీ అంశంలో నిందితుడిగా పరారీలో ఉన్న ‘ఐటీ గ్రిడ్స్’ అశోక్ గురించి పోలీసుల విచారణ కొనసాగుతూ ఉంది. ఈ కేసులో అశోక్ లొంగిపోవడానికి పోలీసులు ఇచ్చిన గడువు సమయం ఇప్పటికే పూర్తి అయ్యింది. అయితే అతడు మాత్రం లొంగిపోలేదు. అతడు ఏపీకి చేరుకున్నాడని, ఏపీ ప్రభుత్వమే అతడికి రక్షణ కల్పిస్తూ ఉందని ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ఇదే సమయంలో అశోక్ ఫోన్ డాటా గురించి పోలీసులు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో కొన్ని ఆసక్తిదాయకమైన విషయాలు బయటపడ్డాయట. వాటి ప్రకారం..గత ఆరు నెలల్లో అశోక్ ఫోన్ నుంచి ఒక నంబర్ కు ఏకంగా పన్నెండు వందల కాల్స్ వెళ్లాయని నిర్ధారించారు పోలీసులు!

ఆరు నెలల్లో పన్నెండు వందల కాల్స్ వెళ్లిన ఆ నంబర్ ఎవరిది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అది అశోక్ ఇంట్లో వాళ్లది కాదు, అతడి సన్నిహితులది కాదు.. అది ఏపీ మంత్రి నారా లోకేష్ బాబుది అనే ప్రచారం జరుగుతూ ఉంది. అధికారిక ధ్రువీకరణ లేకపోయినా.. లోకేష్ తో అశోక్ కు చాలా సాన్నిహిత్యమే గాక.. అతడితో చాలా పనులు చేయిస్తూ ఉన్నారని, ఓట్ల తొలగింపు విషయంలో ఎప్పటికిప్పుడు గైడెన్స్ ఇస్తూ సాగుతున్నారని ప్రచారం జరుగుతోంది.

అందుకే అశోక్ ఏకంగా లోకేష్ నంబర్ కే ఫోన్ చేసి పన్నెండు వందల సార్లు మాట్లాడారని అంటున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ పోలీసులు ప్రకటన చేయడంతో పాటు.. ఏపీ మంత్రి లోకేష్ కు నోటీసులు కూడా జారీ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.