మేడమ్ టుస్సాడ్ లో మరో హీరో మైనపు విగ్రహం!

ప్రతిభావంతులు, గొప్పవారు అయిన కొందరు వ్యక్తుల మైనపు విగ్రహాలను తయారు చేసి ఇంటర్నేషనల్ మ్యూజియం అయిన మేడమ్ టుస్సాడ్ లో స్థానం కల్పిస్తారు. మహాత్మాగాంధీ, నరేంద్ర మోడీ, అమితాబ్ బచ్చన్ వంటి వారి మైనపు విగ్రహాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. బాహుబలి చిత్రంలో నటించిన తరువాత హీరో ప్రభాస్ కు కూడా ఈ అరుదైన గౌరవం లభించింది. ఇప్పుడు మరో 
యంగ్ హీరో ఈ గౌరవాన్ని పొందబోతున్నాడు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఇటీవల ‘జూడ్వా2’ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం తన తదుపరి సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. అయితే మేడమ్ టుస్సాడ్ నిర్వాహకులు ఆ సెట్ కు వెళ్ళి మరీ వరుణ్ ను కలిసి మైనపు విగ్రహం కోసం కావల్సిన కొలతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ‘ఇంత తొందరగా మేడమ్ టుస్సాడ్ లో నా స్టాట్యూ ఏర్పాటు చేస్తుండడం నేను ఊహించలేకపోయాను. తక్కువ వయసులోనే నాకు ఇలాంటి అరుదైన గౌరవాన్ని అందించిన మేడమ్ టుస్సాడ్ నిర్వహకులకు నా కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చాడు. వరుణ్ తన స్టాట్యూ పెట్టడానికి అంగీకరించినందుకు సంతోషంగా ఉందని, వచ్చే ఏడాది ఆరంభంలో ఈ మైనపు విగ్రహాన్ని రివీల్ చేస్తామని సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.