అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతుండటంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా పోలీసు
యంత్రాంగం అప్రమత్తమైంది. పొంగి పొర్లుతున్న వాగుల వద్ద రాకపోకలు నిలిచిపోయాయని, ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా హోం గార్డులు, పోలీసుల గస్తీ ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయని, ముఖ్యంగా వేలేరుపాడు, కుకునూరు, పోలవరం, బుట్టాయగూడెం, గోపాల పురం ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితి ఉందన్నారు. తాజాగా విజయరాయి వద్ద తమ్మిలేరు గట్టు స్వల్పంగా దెబ్బతిందని, గోపాలపురం వద్ద ఓ వాగు పొంగుతోందని, ఆయా ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. తమ్మిలేరులో వరదనీరు ఎక్కువగా ఉందని, గేట్లు తీస్తామని అధికారులు చెబుతున్నారు. గేట్లుతీస్తే ఒక్కసారిగా వరద నీరు పల్లపు ప్రాంతాలను ముంచెత్తుతుందని, అందుకే తమ్మిలేరు ఎర్రకాలువ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, అక్కడ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

గత నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంటే, తమ్మిలేరు రిజర్వాయర్ నిండు కుండలా మారింది. పశ్చిమ ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. డెల్టాలో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులు ఉప్పొంగడంతో జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్‌వే పైకి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం కాలువపై నాలుగడుగుల మేర వరదనీరు చేరడంతో సుమారు 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో పోలవరం వచ్చేందుకు ఏజెన్సీవాసులు నానా అవస్థలు పడ్డారు. కాజ్‌వేకు ఇరువైపుల నుంచి ఆటోల్లో ప్రయాణించి వరద నీటిలో నడుచుకుంటూ పోలవరం చేరుకున్నారు. పోలవరం మండలంలోని ఇసుక కాలువ, కొవ్వాడ కాలువ, కొత్తూరు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పట్టిసం ఎత్తిపోతల పథకం ప్రాంతంలో పంట పొలాలు వర్షపునీటితో నిండిపోయాయి. కొవ్వూరులో గోష్పాదక్షేత్రం స్నానఘట్టం నీటమునిగింది.

గోదావరి నదిలో నీటిమట్టం పెరిగితే ఆ పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లుచేశామని ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం లెవల్ 1లో ఉందని, లెవల్ 3కు వస్తే ప్రమాదం ముంచుకొస్తుందన్నారు. జిల్లాలో 30, 40 గ్రామాల్లోకి నీరు చేరే అవకాశం ఉంటుందని తెలిపారు. వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలవారు రాత్రివేళ కూడా కనిపెట్టుకొని ఉండాలన్నారు. ఏమాత్రం నీరు చేరుతుందన్న సమాచారం ఉన్నా వెంటనే అధికారులకు తెలపాలని సూచించారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని, సహాయక చర్యలు, ముందస్తు ఏర్పాట్లు చేపట్టామని ఎస్పీ వివరించారు.













