అల్లు అర్జున్‌ ‘కనబడుటలేదు’!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తరువాతి చిత్రంకు ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బన్నీ నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘కనబడుటలేదు’ అన్నది ఉప శీర్షిక. ఈరోజు బన్నీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరన్నది తెలియాల్సి ఉంది. మరోపక్క సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ నటించనున్నారన్న విషయం నిజమేనని ఈ సినిమా బృందం పేర్కొంది. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందనను ఎంపిక చేశారు. ‘అల్లు అర్జున్‌ 20వ చిత్రం. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తారు. సౌత్‌ సెన్సేషన్‌ రష్మిక మందన హీరోయిన్‌. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది’ అని పేర్కొంది. ఈ ట్వీట్‌పై రష్మిక స్పందిస్తూ..’సో.. ఎగ్జైటెడ్’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలు వచ్చాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్‌.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఇంకా సినిమాకు టైటిల్‌ ఖరారు కాలేదు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ సినిమాను నిర్మిస్తోంది.