‘అమ్మఒడి’ పై జగన్‌ సంచలన నిర్ణయం

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని తలపెట్టిన అమ్మఒడి అమలుపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని ఇంటర్‌ విద్యార్థులకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బడికి పంపే ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్‌ విద్యార్థులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులకూ అమ్మఒడి వర్తింపజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెల్లరేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుని ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేలు ఇవ్వాలని నిర్ణయించారు.

పాఠశాలల్లో సౌకర్యాల పెంపు, మెరుగైన విద్యాబోధన, నాణ్యతా ప్రమాణాల పెంపే లక్ష్యంగా విద్యాశాఖపై సమీక్షించిన సీఎం.. పాఠశాలల్లో ప్రతి 20-25 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలన్న సీఎం.. మౌలిక సదుపాయాల కల్పనకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల ఎంపికకు తక్షణమే సెర్చ్‌ కమిటీలు వేయాలని, ఈ సాయంత్రానికి సెర్చ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. 30 రోజుల్లోగా ఉపకులపతులను ఎంపిక చేయాలని, వర్సిటీల్లో అన్ని ఖాళీలను ఈ ఏడాది చివరికల్లా భర్తీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. పారదర్శక విధానంలో ఉపకులపతుల ఎంపిక జరగాలని, అత్యంత అర్హత, అనుభవం ఉన్న వారిని ఉపకులపతులగా ఎంపిక చేయాలని పేర్కొన్నారు.