గోపీచంద్ హీరోగా.. స్పెసిలిస్ట్ మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ”పక్కా కమర్షియల్”. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ కోర్టు డ్రామాలో బబ్లీ బ్యూటీ రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని 2022 జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘అందాల రాశీ’ అనే గీతాన్ని జూన్ 1న రిలీజ్ చేయనున్నారు.
తాజాగా ఈ సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. ‘అందాల రాశీ మేకప్ వేసి.. నాకోసం వచ్చేనే.. స్వర్గంలో కేసే నామీద వేసి భూమ్మీద మూసావే..’ అంటూ సాగిన ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ గీతానికి కె.కె సాహిత్యం అందించారు. సాయి చరణ్ భాస్కరుని – రమ్య బెహర కలిసి ఆలపించారు. ‘అందాల రాశీ’ పూర్తి పాట లిరికల్ వీడియోని జూన్ 1 సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నారు. జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. SKN సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.