సరిహద్దులో ఆందోళనపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రధాని నరేంద్రమోదీ లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ నిబంధనలను అన్ని రాష్ట్రాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టళ్లు మూతపడటంతో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, కొంతమంది ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చిన వారు, చిన్న చిన్న సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న కొందరు పోలీసుల అనుమతి తీసుకుని సొంత ఊళ్లకు బయల్దేరు. అయితే తెలంగాణలో వారికి ఎక్కడా అడ్డంకులు ఎదురు కాలేదు. ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌లోకి వెళ్లేసరికి అక్కడి పోలీసులు వీరిని అడ్డుకుని రాష్ట్రంలోకి ప్రవేశం లేదని ఆపేశారు.

బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ సరిహద్దుల్లోని చెక్‌పోస్టు వరకూ వివిధ వాహనాల్లో విద్యార్థులు చేరుకుంటూనే ఉన్నారు. అక్కడి పోలీసు అధికారులు వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని తెలిపారు. రాత్రంతా రోడ్డుపైనే వారికి నిరీక్షణ తప్పలేదు. క్వారంటైన్‌కు వెళ్లేది లేదని ఆందోళనకు దిగారు. పోలీసు అధికారులతో పాటు ఏపీ ప్రభుత్వంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉపాధి కోసం వెళ్లిన నిరుద్యోగులంతా తిరిగి స్వగ్రామాలకు బయల్దేరడంతో ఏపీ ప్రభుత్వానికి కొత్త సవాలు ఎదురైంది. వీరందరినీ ఏపీ సరిహద్దుల్లో పోలీసులు నిలిపేస్తున్నారు.

ఈ అంశంపై స్పందించిన ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించిందని గుర్తుచేశారు. ఎక్కడివారు అక్కడే ఉండాల్సిందిగా లాక్‌డౌన్ విధించారని, కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతిఒక్కరు సహకరించాలని స్వయంగా దేశ ప్రధాని, ముఖ్యమంత్రి చేతులు జోడించి ప్రజలందరిని కోరారని అన్నారు. నిన్నటి నుండి కొందరు నిబంధనలకు విరుద్దంగా రాష్ట్రంలోకి రావడానికి ప్రయత్నిస్తూ సరిహద్దు చెక్‌పోస్టు వద్దకు వచ్చి ఉన్నారని.. వారిని నిబంధనలకు విరుద్దంగా రాష్ట్రంలోనికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

బోర్డర్ వద్దకు వచ్చిన వారికి నిబంధనల మేరకు కచ్చితంగా రెండు వారాలపాటు క్యారంటైన్ నిర్వహించిన తరువాతే రాష్ట్రం లోకి అనుమతి ఉంటుందని అన్నారు ఏపీ డీజీపీ. లాక్ డౌన్ ఉదేశ్యం ఒక మనిషి నుండి మరొక మనిషికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి అంటువ్యాధి సంక్రమించకండా ఉండేలా చేయడమేనని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తే లాక్‌డౌన్‌ను నీరు గార్చడమేనని అన్నారు.