బ్యాంకాక్‌లో బాలయ్య దబిడిదిబిడే..

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవి కుమార్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి సి.కల్యాణ్‌ నిర్మాత. ‘జై సింహా’ తర్వాత మళ్లీ ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఈ మూవీ బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్‌లు నటించనున్నారు. ఆ ఇద్దరు ఎవరన్నది అధికారికంగా ప్రకటించలేదు చిత్రబృందం. సోనాల్‌ చౌహాన్‌, వేదికతో పాటు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ నెల 9న బ్యాంకాక్‌లో చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. అక్కడ పలు కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. మాస్‌ అంశాలతో సాగే ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది.

బాలకృష్ణతో సినిమాలు తీయడం కోసం పలువురు దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయనతో ఇదివరకు సినిమాలు చేసిన దర్శకుల్లో చాలామంది మళ్లీ కథలు సిద్ధం చేస్తున్నారు. అందులో పూరి జగన్నాథ్‌ ఒకరు. బాలకృష్ణతో ఇదివరకు ఆయన ‘పైసా వసూల్‌’ తెరకెక్కించారు. ఆ కలయికలో మరో చిత్రం రూపొందనున్నట్టు సమాచారం. హిందీలో విజయవంతమైన ఓ సినిమాని బాలకృష్ణతో రీమేక్‌ చేయాలని ఓ అగ్ర నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ సినిమాల గురించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.