“బంతిపూల జానకి” రివ్యూ!

“బంతిపూల జానకి” రివ్యూ!
 
నటీనటులు: 
ధనరాజ్, దీక్షా పంత్, శకలక శంకర్, అదుర్స్ రఘు, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, డాక్టర్ భరత్ తదితరులు.. 
 
సాంకేతికవర్గం: 
సంగీతం: భోలే
ఛాయాగ్రహణం: జి.ఎల్.బాబు 
కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్
నిర్మాతలు: కళ్యాణి-రామ్ 
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్ 
విడుదల తేదీ: 26/8/2016 
రేటింగ్: 2.75/5 
 
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. తర్వాతి కాలంలో బిజీ కమెడియన్ గా మారిన ధనరాజ్ అప్పుడప్పుడూ హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకొంటూ వస్తున్నాడు. తాజాగా ధనరాజ్ హీరోగా నటించిన చిత్రం “బంతిపూల జానకి”. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో “జబర్దస్త్” ఫేమ్ కమెడియన్స్ అందరూ నటించడం విశేషం. కామెడీ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కామన్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం..!!
8x12 - 03 copy
 
కథ:
జానకి అలియాస్ బంతిపూల జానకి (దీక్షాపంత్) తాను నటించిన చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ ప్రకటించడంతో.. తనకు నేషనల్ అవార్డ్ రావడానికి కారకులైన నిర్మాత బంగారయ్య (అదుర్స్ రఘు), హీరో ఆకాష్ (సుడిగాలి సుధీర్), దర్శకుడు అహంకారం (చమ్మక్ చంద్ర), రైటర్ మిరియాలు (రాకెట్ రాఘవ) ఒకరికి తెలియకుండా మరొకరు జానకి ఇంటికి చేరుకొంటారు. 
పైకి కేవలం శుభాకాంక్షలు చెప్పేందుకే వచ్చినప్పటికీ.. వారి మనసులో భావన మాత్రం వేరే. అయితే.. జానకిని లోబరుచుకోవడం లేదా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాలని ప్రయత్నించినవారందరూ ఒక్కొక్కరిగా యాధృచికంగా మరణిస్తుంటారు. ఈ మరణాలు బయట పడితే.. తనకు ప్రకటించబడిన నేషనల్ అవార్డ్ ఎక్కడ పోతుందో అన్న భయంతో.. తనకు మంచి స్నేహితుడు, ప్రస్తుతం మేనేజర్ గా వ్యవహరిస్తున్న శ్యామ్ (ధనరాజ్) సహాయంతో ఆ చనిపోయినవారి శవాలను దాచేయాలనుకొంటుంది. 
అసలు ఒక్కొక్కరుగా ఎందుకు చనిపోతుంటారు? మరి జానకి ఆ పొరపాటున జరిగిన హత్యల నుంచి బయటపడిందా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కిన చిత్రం “బంతిపూల జానకి”. 
4x8 - 13 copy
 
నటీనటుల పనితీరు: 
టైటిల్ పాత్రధారిణి “బంతిపూల జానకి”గా దీక్షాపంత్ నటించడానికి విపరీతంగా ప్రయత్నించింది. అయితే.. హావభావాల ప్రదర్శన పరంగా ఇంకా ఓనమాలు దిద్దే స్థాయిలోనే ఉన్న దీక్షా.. గ్లామరస్ గా కనువిందు చేసినప్పటికీ, నటన పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 
నటుడిగా ధనరాజ్ ఈ చిత్రంలో ఒకింత ఆశ్చర్యపరిచాడనే చెప్పాలి. రెగ్యులర్ కామెడీతో కాకుండా చాలా సెటిల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్నాడు. 
అన్నదానం అనే దొంగపాత్రలో శకలక శంకర్ కథలో కీలకమైన మలుపు తీసుకురావడంతోపాటు.. తనదైన శైలిలో నవ్వించాడు. 
చమ్మక్ చంద్ర, అదుర్స్ రఘు, రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్ లు తమ తమ పాత్రల పరిధిమేరకు పర్వాలేదనిపించుకొన్నారు.
4x8 - 11 copy
 
ప్లస్ పాయింట్స్: 
కెమెరా వర్క్ 
ధనరాజ్ పెర్ఫార్మెన్స్ 
క్లైమాక్స్ 
 
మైనస్ పాయింట్స్: 
కథ-కథనం 
ప్రీ క్లైమాక్స్ 
 
సాంకేతికవర్గం పనితీరు: 
భోలే సంగీతం మాస్ ఆడియన్స్ కు మాత్రమే అన్నట్లుగా ఉంది. ధనరాజ్ పాడిన పాట వినసోంపుగా లేకపోవడంతోపాటు.. సదరు పాటను సినిమా ప్రారంభంలో పెట్టడంతో అప్పుడే థియేటర్ లో సెటిల్ అవుతున్న ఆడియన్స్ మైండ్ పై ప్రభావం చూపుతుంది. 
జి.ఎల్.బాబు కెమెరా పనితనం బాగుంది. నైట్ ఎఫెక్ట్ లైటింగ్ చక్కగా సెట్ చేసుకొన్నాడు. అందువల్ల సినిమా మొత్తం నైట్ ఎఫెక్ట్ లోనే జరుగుతుందన్న ఫీల్ ప్రేక్షకుడికి కలిగిస్తూనే.. ఎక్కడా చీకటి లేకుండా బాగా కవర్ చేశాడు. 
శేఖర్ విఖ్యాత్ సమకూర్చిన సంభాషణాలు సోసోగా ఉన్నాయి. ఇక కథలోని మెయిన్ థ్రెడ్ ను కొరియన్ సినిమా “హ్యాపీ కిల్లింగ్” నుంచి స్పూర్తి పోందడం గమనార్హం.
8x12 - 04 copy 
 
నెల్లుట్ల ప్రవీణ్ చందర్ సమకూర్చిన స్క్రీన్ ప్లే బోరింగ్ గా ఉన్నప్పటికీ.. సీన్ టు సీన్ కనెక్టివిటీ మాత్రం ఆకట్టుకోగలిగింది. ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా అలరించగలిగాడు. అయితే.. ఉన్న కామెడియన్స్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోకుండా వారి క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేయడానికే ఎక్కువ సమయం కేటాయించడం మాత్రం ప్రేక్షకుడ్ని కాస్త అసహనానికి గురి చేస్తుంది. ముఖ్యంగా.. సినిమా రన్ టైమే 89 నిమిషాలు అనగా గంటా ముప్పై తొమ్మిది నిమిషాలు కాగా.. అంత అతి తక్కువ సమయంలోనూ ల్యాగ్ ఉండడం మాత్రం జీర్ణించుకోలేడు.  
 
మొత్తానికి.. 
జబర్దస్త్ గ్యాంగ్ మొత్తం ఉంది కదా అని విపరీతమైన కామెడీ ఎక్స్ ఫెక్ట్ చేయకుండా టైమ్ పాస్ కోసం ఒకసారి చూడదగ్గ చిత్రం “బంతిపూల జానకి”.
20x10 - 02 copy
CLICK HERE!! For the aha Latest Updates