AP Elections 2024: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ.. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరుగుతునే ఉన్నాయి. ఈ సారి అత్యధిక ఓటింగ్ శాంతం నమోదు కావడంతో.. ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి. నేతలు మొదలుకుని ఇతర వ్యాపారులు, ఉద్యోగవర్గాలు ఇలా పలువురు పందేలు కాస్తున్నారు.
రాజకీయ చైతన్యానికి మారుపేరు అయిన గుంటూరులో బెట్టింగులు బాగా ఊపందుకున్నాయి. ఓ ప్రముఖ క్లబ్ కేంద్రంగా కొన్ని పందేలు జరుగుతుండగా మరికొన్ని నేతల మధ్య జరుగుతున్నాయి. కూటమి అధికారంలోకి వస్తుందని, 130కు పైగా సీట్లు దక్కించుకుంటుందని ఇలా బెట్టింగ్‌లు కాస్తుండగా వైసీపీ కి 20 నుంచి 40 లోపు సీట్లు వస్తాయని, ఇందుకు సిద్ధపడాలని ప్రధానంగా కూటమి నాయకులు రెట్టించి పందేలు కాయటానికి ముందుకొస్తున్నారు. ఆ స్థాయిలో వైసీపీ నేతల నుంచి ప్రతిస్పందన లేదని, వారు పందేలకు వెనుకంజ వేస్తున్నారని చర్చ జరుగుతోంది.
మంగళగిరి, గుంటూరు పశ్చిమ, మాచర్ల, బాపట్ల, చీరాల నియోజకవర్గాలపై పెద్దమొత్తంలో బెట్టింగులు జరుగుతున్నాయి. కూటమి ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పాటవుతుందని, వైసీపీకి 30 సీట్లకు మించి రావని, మంగళగిరిలో నారా లోకేశ్‌కు 20వేలకు పైగా మెజార్టీ వస్తుందని, మాచర్లలో ఈసారి టీడీపీ జెండా ఎగురుతుందని పందేలు రూ.లక్షల నుంచి రూ.కోట్లలో కాస్తున్నారు. ఒక్క గుంటూరు నగరంలోనే మిర్చి ఎగుమతి, కాటన్, పొగాకు, స్థిరాస్తి వ్యాపారులు రూ.5-6 కోట్లకు పైగా పందేలు వేశారు.
కూటమి అధికారంలోకి రాదని ఎవరైనా పందేనికి సిద్ధపడితే వారికి రూపాయికి మూడు రూపాయిలు అదనంగా ఇస్తామని గుంటూరులో ప్రముఖ క్లబ్‌లో సభ్యత్వం కలిగిన ఇద్దరు సభ్యులు ముందుకొచ్చారు. పోలింగ్ సరళి నేపథ్యంలో ఇలా ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. వైసీపీ వాళ్లు మాత్రం పందేం అంటే చాలు వెనక్కుపోతున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు.
పోలింగ్‌కు ముందు కొరెటిపాడుకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి వైసీపీ అధికారంలోకి వస్తుందని పందేం వేయటానికి ఎవరైనా సిద్ధమేనంటూ ఊగారు. ఆ వ్యాపారిని తాజాగా మంగళవారం కలిసి వైసీపీ అధికారంలోకి రాదని రూ.20 లక్షల పందేం వేస్తాం సిద్ధమా అంటూ మధ్యవర్తుల ద్వారా కబురు పంపితే విముఖత చూపారనే చర్చ జరగుతోంది.
మంగళగిరిలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేశ్‌పై మెజార్టీ విషయంలోనే కాదు అక్కడ వైసీపీ గెలవదని పెద్దఎత్తున పందేలు కాయడానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే మంగళగిరిలో టీడీపీ గెలుస్తుందని, లోకేశ్‌కు 20 వేలకు పైగా మెజార్టీ వస్తుందని రూ.3-4 కోట్ల వరకు పందేలు కాశారు. ఆ తర్వాత పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుపై గుంటూరు కేంద్రంగా పందేలు బాగానే జరుగుతున్నాయి.
నగరానికి చెందిన గుత్తేదారు ఒకరు పవన్‌కు 30వేలకు పైగా మెజార్టీ వస్తుందని రూ.10లక్షల పందేం కాశారు. గుంటూరు పశ్చిమం, తూర్పు నియోజకవర్గాల్లో గెలిచేది టీడీపీనే అంటూ పెద్దఎత్తున పందేలు కాయడానికి సిద్ధపడుతున్నా స్పందించడం లేదని బెట్టింగ్ రాయుళ్లు అంటున్నారు. కూటమి అభ్యర్థిపై బాపట్ల పరిసరాల్లో రొయ్యల వ్యాపారుల మధ్య బాగా పందేలు సాగుతున్నాయి.
అక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన నరేంద్రవర్మ విజయం సాధిస్తారని రూ.10లక్షల వరకు పందేలు సాగాయి. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో అక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారని ఒకరిద్దరు పందేలు వేయగా, వైసీపీ తరఫున కరణం వెంకటేశ్ గెలుపొందుతారని అక్కడ వస్త్ర వ్యాపారుల మధ్య రూ.లక్షల్లో పందేలు జరిగాయి.