నేటితో ప్రచార హోరు మూగబోనుంది


ఈ రోజు బుధవారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు మూగబోనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం 7వ తేదిన పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారటంతో ప్రచారం నువ్వా? నేనా? అన్నట్లుగా సాగుతోంది. పోలింగ్‌ ప్రక్రియ ముగియటానికి 48 గంటల ముందుగా ప్రచారానికి తెరదించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన. ఇదిలాఉండగా ఎన్నికల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నియోజకవర్గాలకు కేటాయించాల్సిన ఈవీఎంలు, వీవీపీఏటీలను సిద్ధం చేశారు. కాస్త ఆలస్యమైనప్పటికీ ఈవీఎంలపై అతికించే బ్యాలెట్‌ పత్రాల ముద్రణ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి అయింది. పోలింగ్‌ నిర్వహణకు 32,815 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ‘అందరికీ అందుబాటులో ఎన్నికలు’ అనే నినాదంతో ఈ దఫా దివ్యాంగులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా పోలింగ్‌ సమయాల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. సాధారణ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ ఉదయం 7 గంటలకే ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.

పోలింగ్‌ కేంద్రాలన్నింటినీ ధూమపాన నిషేధ ప్రాంతాలుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ మేరకు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ధూమపాన నిషేధానికి సంబంధించిన స్టిక్కర్లను సిద్ధం చేశారు. ఎవరైనా మద్యం తాగి పోలింగ్‌ కేంద్రం వద్దకు వస్తే అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్‌ ముగిసేంత వరకూ మద్య నిషేధం(డ్రై డే) అమలులో ఉంటుంది. మద్యం సేవించి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేయించి నిబంధనల మేరకు కేసులు నమోదు చేస్తారు.

నిర్ధారిత గడువు తరువాత రాజకీయ పార్టీలు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. సినిమా హాళ్లు, టీవీ ఛానల్స్‌లో అభ్యర్థులు, పార్టీలకు సంబంధించిన ప్రచార ప్రకటనలు ప్రసారం చేయకూడదని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ఎలాంటి నృత్య రూపకాలు, సంగీత విభావరిలను నిర్వహించకూడదని స్పష్టం చేశారు. పోలింగ్‌ ముగియటానికి 48 గంటల ముందుగా ప్రచారాన్ని ముగించాలన్న ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాలంటూ జిల్లా ఎన్నికల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.