జనసేనలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కండువ కప్పి లక్ష్మీనారాయణను జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మంచి జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాదరణ.. ఈ మూడు లక్షణాలు ఉన్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని కొనియాడారు. ప్రజల కోసం, ప్రజాసేవలో పనిచేస్తున్న పవన్‌ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. జనసైనికుల్లో తాను కూడా ఒకడిగా మారిపోయానని తెలిపారు. పవన్‌ మార్గదర్శకత్వంలో మనమంతా ముందుకువెళ్తూ.. ప్రజలు మనపై పెట్టుకున్న ఆశలను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామన్నారు. ‘ మనం ముందుకెళ్దాం.. దేశాన్ని మారుద్దాం.. జనసేన అంటే ఎంటో చూపిద్దాం’ అంటూ లక్ష్మీనారాయణ నినదించారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీనారాయణతోపాటు కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ మాజీ వీసీ రాజగోపాల్‌ కూడా పవన్‌ ఆధ్వర్యంలో జనసేలో చేరారు. అయితే లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేసే విషయాన్ని సాయంత్రం వెల్లడించనున్నట్లు సమాచారం.