నందమూరి తారక రామారావు తెలుగు సినీ వినీలాకాశంలో ఓ సంచలనం. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఆయనో ప్రభంజనం. ఆయన పేరు తెలుగువాడి ఆత్మగౌరవం, ఆయన తీరు రాజకీయ విశ్వరూపం. నటుడిగా ప్రజల గుండెల్లో కొలువైన దైవరూపం. నాయకుడిగా ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం. తెలుగు జాతి ఆత్మగౌరవం హస్తిన వీధుల్లో పరాభవానికి గురవుతున్న సమయంలో ఢిల్లీ అహంకారంపై తిరుగుబావుటా ఎగరేసి, తల ఎత్తి తెలుగోడి సత్తా చాటిన యుగపురుషుడు ఎన్టీఆర్.
స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆగస్ట్ 28న కేంద్ర ప్రభుత్వం ఆయన పేరున రూ.100 నాణెంను విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి, బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, ఎంపీలు హాజరయ్యారు.
రూ.100 నాణెం 44 మిమీ వ్యాసం కలిగి ఉంది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో రూపొందించబడింది. నాణేనికి ఒకవైపు మూడు సింహాలు, అశోకచక్రం ఉండగా, మరో వైపు హిందీలో హిందీలో ‘నందమూరి తారక రామారావు శతజయంతి’ అని చెక్కబడిన ఎన్టీఆర్ చిత్రం ఉంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను సూచించేందుకు నాణెం 1923-2023 సంవత్సరాలతో గుర్తించబడింది. నాణెంతో పాటు, తెలుగు ప్రైడ్‌గా పేరొందిన ఎన్టీఆర్ చరిత్రాత్మక జీవిత ప్రయాణాన్ని వివరించే నాలుగు పేజీల పుస్తకాన్ని కూడా కొనుగోలుదారులకు అందించనున్నారు.