Homeతెలుగు Newsఅమరావతిని బంగారు గుడ్డు పెట్టే బాతుగా మారుస్తా: చంద్రబాబు

అమరావతిని బంగారు గుడ్డు పెట్టే బాతుగా మారుస్తా: చంద్రబాబు

4 28ఈశాన్యంలో ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం రాష్ట్రానికి సరైన వాస్తు అని చంద్రబాబు అన్నారు. భౌగోళికంగా రాష్ట్రానికి మొదటి నియోజకవర్గం ఇచ్ఛాపురం.. చివరన ఉన్నది కుప్పం అని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు టీడీపీనే గెలవాల్సిన అవసరముందన్నారు. ఆ చివర్లో తన నియోజకవర్గం కుప్పం నుంచి ఈ చివరన ఇచ్ఛాపురం వరకు మొత్తం తమదేనని, ఏమాత్రం అనుమానంలేదని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. శ్రీకాకుళం అంటే వలసల జిల్లా కాదని.. వేరే జిల్లాల ప్రజలు సైతం ఉపాధి కోసం ఇక్కడికి వచ్చేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

టీడీపీకి వెనుకబడిన వర్గాలు ఎప్పుడూ కంచుకోటగా ఉంటున్నాయని చంద్రబాబు అన్నారు. మత్స్యకారులకు ఆర్థికంగా, సామాజికంగా న్యాయం చేసే బాధ్యత తమదని చెప్పారు. వెనుకబడిన వర్గాల కోసం 21 కార్పొరేషన్లు పెట్టామని వివరించారు. జగన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి 24 సార్లు వచ్చిన జగన్‌.. కోర్టుకు మాత్రం 248 సార్లు వెళ్లారని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకుడు కావాలా అని ప్రశ్నించారు. న్యాయం, ధర్మం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే సత్తా తనకుందన్నారు. కేసీఆర్‌కు భయపడే ప్రసక్తే లేదని.. అలాంటి వారిని తన రాజకీయ జీవితంలో చాలా మందిని చూశానన్నారు. హైదరాబాద్‌ మాదిరిగానే అమరావతి కూడా బంగారు గుడ్డు పెట్టే బాతుగా మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు బీచ్‌ రోడ్డు అభివృద్ధి చేస్తామన్నారు. తొలి విడతలో ఇచ్ఛాపురం నుంచి భోగాపురం వరకు అభివృద్ధి చేసి జాతీయ రహదారికి అనుసంధానిస్తామని సీఎం వివరించారు.

తానేదో అభివృద్ధి చేయలేదని ప్రధాని అంటున్నారని.. ధైర్యం ఉంటే ఢిల్లీలో డిబేట్ పెడదామని సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌లో తాను.. అహ్మదాబాద్‌లో మోడీ ఏం చేశారో చర్చకు సిద్ధమా అన్నారు. ఈ ఐదేళ్లలో కేంద్రంలో మోడీ చేశారో.. ఏపీలో తానేం చేశానో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మోడీ మాటల ప్రధాని అని.. ఆయన మాటలు కోటలు దాటతాయంటూ ఎద్దేవా చేశారు. విలువలు, పద్ధతులు, హుందాతనం లేని వ్యక్తి అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రానికి బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని పునరుద్ఘాటించారు. సినీనటుడు పవన్‌ కల్యాణ్‌కు ఏమైనా అవగాహన ఉందా అని ప్రశ్నించారు. మాటలు వేరు.. పనులు చేయడం వేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఉద్దానంలో కిడ్నీ రోగులకు డయాలసిస్‌ చేయిస్తున్నామని.. వారికి పింఛను ఇచ్చి ఆదుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాంతంలో కిడ్నీ రోగుల కోసం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, ఆరోగ్య రంగాల్లో పేదలకు ఖర్చులు తగ్గిస్తామని చెప్పారు. అనారోగ్యం సందర్భాల్లో సమీపంలోని మెడికల్‌ షాపుల్లో మందులు కొంటే ఆ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రన్న బీమా రూ.10లక్షలు చేస్తామని.. పెళ్లి కానుకను రూ.లక్షకు పెంచుతామని చెప్పారు. తిత్లీ తుపాను పరిహారం ఇంకా అందని బాధిత రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తన కుటుంబసభ్యుడితో సమానమని చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థి బెందాళం అశోక్‌, ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌ను ప్రజలంతా ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu