Homeతెలుగు Newsకేసీఆర్‌ అందుకే భయపడుతున్నారు: చంద్రబాబు

కేసీఆర్‌ అందుకే భయపడుతున్నారు: చంద్రబాబు

11 20టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు .. హైదరాబాద్‌ కంటే మెరుగైన నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మొదట్లో అందరూ బెంగళూరు వెళ్లేవారని.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాక అక్కడికి వచ్చారని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానన్నారు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్‌ దెబ్బతింటుందని కేసీఆర్‌ భయపడుతున్నారన్నారు.

నదుల అనుసంధానం చేస్తున్నామని.. దీంతో నీటి భద్రత లభిస్తుందని చంద్రబాబు చెప్పారు. దీన్ని భరించలేకే పోలవరానికి కేసీఆర్‌ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. నాగార్జున సాగర్‌లో నీళ్లు తీసుకోకూడదని శ్రీశైలానికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. 31 కేసులుండే జగన్‌.. మనకు శాంతిభద్రతలు కల్పిస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఊరికొక గూండా వచ్చి మన ఆస్తుల్ని కబ్జా చేస్తారన్నారు. రాష్ట్రాన్ని దుర్మార్గుల చేతిలో పెడితే ఏమవుతుందో ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలని చెప్పారు. ప్రత్యేకహోదాకు మద్దతిస్తానని కేసీఆర్‌ ఎప్పుడు చెప్పారని ప్రశ్నించారు. కేసుల కోసం లాలూచీపడి రాష్ట్రానికి అన్యాయం చేస్తే వదలబోమని సీఎం హెచ్చరించారు. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నారు.

యువతకు గార్డియన్‌గా ఉంటానని.. ఉద్యోగాలు వచ్చేలా చూస్తానని చంద్రబాబు అన్నారు. పేద యువత భవిష్యత్తు కోసం 10 సూత్రాల పథకం తీసుకొచ్చానని చెప్పారు. కొవ్వూరు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని.. ఈ పట్టణంలో వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పామాయిల్‌, ఆక్వా రైతులను ఆదుకుంటున్నామన్నారు. తన రాజకీయ జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ పశ్చిమగోదావరి జిల్లాకే ఉంటుందని చెప్పారు. తాను ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని మోసం చేసే రకం కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి అనితను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu