మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్‌ రూ.3 వేలు: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే పింఛన్లను రూ.3వేలకు పెంచుతామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వృద్ధాప్య ఫించన్ల అర్హత వయసును తగ్గిస్తామని తెలిపారు. 300 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో ఉచితంగా ఇళ్లు నిర్మించి తీరుతామని చెప్పారు. పార్టీ నేతలతో సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

జగన్ తన బతుకు బాగు కోసం ఇక్కడ బతికే వారికి శాశ్వత సమాధి కట్టాలని చూస్తున్నాడని ఆక్షేపించారు. జగన్‌వి పిరికిపంద రాజకీయాలని, కేసీఆర్, కేటీఆర్‌కు భయపడుతూ వారివద్ద బానిసలా ఉన్నాడని దుయ్యబట్టారు. 60 ఏళ్లు కష్టపడిన ఆస్తులను లాగేసుకున్నారని, ఇప్పుడు జగన్ రూపంలో మనం కష్టపడి నిర్మించుకుంటున్న నవ్యాంధ్ర ఆస్తులను కూడా లాగేందుకు కుట్ర పన్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పౌరుషంతో మన ఆస్తులను మనం కాపాడుకుందామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారిని వేధింపులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్‌కు తిరిగి పూర్వ వైభవం రావాలంటే ఇక్కడ అసమర్థ ప్రభుత్వం ఉండాలనేది కేసీఆర్ భావన అని చంద్రబాబు అన్నారు.

పవన్ కళ్యాణ్ టీడీపీను, వైసీపీని ఒకే గాటన కట్టడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. లోపల ఒకటి పెట్టుకుని, బయటకు ఒకటి చెప్పటం జగన్‌ తత్వమని విమర్శించారు. జగన్ లాంటి టిపికల్ నేరస్థుల విచారణకు ఎఫ్‌బీఐలో ప్రత్యేక చాప్టర్ ఉందన్నారు. దోచుకోవడమే తప్ప సంపద సృష్టించడం చేతకాని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. వైసీపీకి ఓటేస్తే పింఛన్లు ఆగిపోవడమే కాక.. పంట పొలాలకు నీళ్లు కూడా రావని అన్నారు. వైసీపీ నుంచి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే గెలిపించినా కేసీఆర్‌కే లాభమని చంద్రబాబు పేర్కొన్నారు.